రాయచూరు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన చెరకు, కంది పంటలకు టన్నుకు రూ.5,500 కేటాయించాలని రైతులు డిమాండ్ చేశారు. గురువారం బెళగావి జిల్లాలోని అథణి, బాగలకోటె జిల్లాలోని జమఖండిలలో చేపట్టిన ఆందోళనల్లో సంచాలకుడు లచ్చన్న పూజారి మాట్లాడారు. విజయపుర, కలబుర్గి జిల్లాల రైతులు కూడా కలిసి ఆందోళన చేపట్టారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద జోషితో రైతులు జరిపిన చర్చలు విఫలం కావడంతో గత 15 రోజుల నుంచి రైతులు రాస్తారోకోలు చేపడుతున్నారు. స్వామినాథన్ నివేదికను అమలు చేయాలని ఒత్తిడి చేశారు. రైతులు అర్థనగ్న ప్రదర్శన చేస్తూ రహదారులపై అడ్డంగా పడుకుని నిరసన వ్యక్తం చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు.


