కులాంతర వివాహం చేయించాడని..
సాక్షి,బళ్లారి: కులాంతర వివాహం చేయించాడన్న అక్కసుతో ఆ పెళ్లికి పూజారిగా వ్యవహరించిన వ్యక్తిని దారుణంగా హత్య చేసిన నిందితుడిని బెళగావి జిల్లా సదలగ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు ఇలా.. మహారాష్ట్రలోని ఇచల కరంజి నివాసి అయిన మందార్ అజిత్ రాండే హత్యకు గురైన జ్యోతిష్యుడు. ఈయన జ్యోతిష్యం వృత్తితో పాటు వధూవరులకు మధ్యవర్తిగా ఉంటూ పెళ్లిళ్లు నిర్వహించేవారు. మహారాష్ట్రలోని పేరడవాడ నివాసి బాబాసో అలియాస్ దీపక్ అన్నా మక్కుం కుమార్తె అనుజ(19) గత జనవరి 13న ఇంటి నుంచి వెళ్లిపోయి మహారాష్ట్రలోని శివనాయక్ వాడికి చెందిన ఓంకార్ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ కులాంతర వివాహాన్ని జ్యోతిష్యుడు మందర్ రాండే ముందుండి జరిపించారు. దీంతో ఆక్రోశానికి గురైన పెళ్లి కూతురు తండ్రి దీపక్, పెళ్లి జరిపించిన పండితుడిని ఎలాగైనా హత్య చేయాలనే పథకం వేశాడు. ఈ క్రమంలో గత నెల 31న నిందితుడు గుర్తు తెలియని మొబైల్ నంబర్ నుంచి ఆ జ్యోతిష్యుడుకి ఫోన్ చేశారు. తనకు మరో పెళ్లి జరపడానికి మధ్యవర్తి కావాలంటూ అబద్దాలు చెప్పి నమ్మించాడు. నిందితుడి మాటలు నమ్మి వచ్చిన జ్యోతిష్యుడిపై నిందితుడు ఒక్కసారిగా విరుచుకుపడి ఆయన కంట్లో కారం పొడి చల్లారు. ఆ తర్వాత ముందుగానే సిద్ధం చేసుకున్న కొడవలితో మెడపై నరికి పరారయ్యాడు. అక్కడి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టి, నిందితుడిని అరెస్ట్ చేసి, అన్ని కోణాల్లో దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు.
నిందితుడి అరెస్టు
బెళగావి జిల్లాలో ఘోరం


