● ప్రియురాలి దారుణ హత్య
● పారామిలిటరీ కానిస్టేబుల్ అరెస్టు
సాక్షి,బళ్లారి: ప్రేయసిని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి దారుణంగా హత్య చేసిన ఘటన ఇది. ప్రేమించిన యువతిని ఓ కానిస్టేబుల్ ఎవరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె ఊపిరి తీశారు. రక్షిత సారిక అనే యువతిపై పారామిలటరీ కానిస్టేబుల్ బసప్ప ఈ దారుణానికి పాల్పడ్డారు. ధార్వాడ జిల్లా హారోగేరి గ్రామానికి చెందిన రక్షితతో బసప్ప ప్రేమలో పడ్డాడు. గత నాలుగేళ్ల నుంచి పరస్పరం వీరిద్దరూ ప్రేమించుకునే వారు. గత నెల 28న బయట షికారుకు వెళ్లి వద్దామని పిలిచి, ఎవరూ లేని ప్రాంతానికి నమ్మించి తీసుకెళ్లి ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. హత్యానంతరం కానిస్టేబుల్ బసప్ప ఏమీ ఎరగనట్లుగా తన గ్రామానికి వెళ్లిపోయాడు. అంతేకాకుండా నిందితుడు బసప్ప వివిధ రకాలుగా నాటకాలు ఆడాడు. ఎవరికీ తనపై ఎలాంటి అనుమానం రాకుండా ఉండేలా ప్రేయసి సోదరుడితో కలిసి ఆమె కోసం గాలింపులో కూడా పాలుపంచుకున్నాడు. రక్షిత సోదరుడు తన సోదరి అదృశ్యంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు దర్యాప్తులో భాగంగా అనుమానంతో బసప్పను పోలీసులు స్టేషన్‌కు పిలిపించి తమదైన శైలిలో విచారణ చేయగా, తానే రక్షితను హత్య చేసినట్లు బసప్ప అసలు విషయం ఒప్పుకున్నాడు. పోలీసులు అతనిని అరెస్ట్ చేసి హత్యకు గల ప్రధాన కారణాలపై కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రూ.25 లక్షలతో రాఘవ సరోవర్‌కు శ్రీకారం
రాయచూరు రూరల్: మంత్రాలయంలో రూ.25 లక్షలతో రాఘవ సరోవర్ పథకానికి మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుబుదేంద్ర తీర్థ శ్రీపాదంగళ్ భూమిపూజ చేశారు. బుధవారం మంత్రాలయంలో 25 ఎకరాల స్థలంలో బెంగళూరు ఎంపీ మంజునాథ్ ఆర్థిక సహాయంతో రాఘవ సరోవర్ నిర్మాణ పనులకు ఆయన శ్రీకారం చుట్టారు. మఠం సిబ్బంది పాల్గొన్నారు.
కసాప సమ్మేళనం
ఆహ్వానపత్రిక విడుదల
రాయచూరు రూరల్: నగరంలో ఈనెల 15 నుంచి రెండు రోజుల పాటు కన్నడ సాహిత్య పరిషత్(కసాప)12వ జిల్లా సమ్మేళనాన్ని నిర్వహిస్తున్నట్లు సమ్మేళనం కార్యాధ్యక్షుడు బోసురాజు పేర్కొన్నారు. ఆయన బుధవారం కన్నడ భవనంలో కసాప జిల్లా సమ్మేళనం ఆహ్వాన పత్రికను విడుదల చేసి విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. నగరంలోని పండిత సిద్దరామ జంబలదిన్ని రంగ మందిరంలో రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి అజయ్‌సింగ్ సమ్మేళనాన్ని ప్రారంభిస్తారన్నారు. జిల్లా సమ్మేళనంలో ఆరు కవిగోష్టులను ఏర్పాటు చేశామన్నారు. మహిళా సమాజం నుంచి సర్వాధ్యక్షుడు రామణ్ణ హవళేను రంగమందిరం వరకు ఊరేగిస్తారన్నారు. రంగణ్ణ పాటిల్, జయన్న, బాబు భండారిగళ్, వీర హనుమాన్, రావుత్ రావ్, సంతోష్, తాయప్ప, ప్రతిభ పాల్గొన్నారు.
బీసీలకు రిజర్వేషన్లు కల్పించండి
రాయచూరు రూరల్: జిల్లాలో వెనుక బడిన వర్గాలకు రాజకీయంగా రిజర్వేషన్లు కల్పించాలని వెనుక బడిన వర్గాల న్యాయవాదుల సంఘం సంచాలకుడు శ్రీకాంత్ డిమాండ్ చేశారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుక బడిన వర్గాలకు సమానంగా రిజర్వేషన్లు కోటాలో టికెట్లను కేటాయించాలన్నారు. వెనుక బడిన వర్గాల కోటాలో 33 శాతం మేరకు రిజర్వేషన్లు కల్పించడానికి రాజకీయ పార్టీలు, సర్కార్ ముందుకు రావాలన్నారు.
సర్‌తో దేశ ఓటర్లు తప్పుదోవ
రాయచూరు రూరల్: దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఓటరు నమోదు ప్రక్రియ(సర్) తప్పుదోవ పట్టించిందని జనపర వేదిక సంచాలకుడు మారెప్ప ఆరోపించారు. బుధవారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సర్‌తో ఓటర్లను దారి తప్పించే ప్రయత్నం చేశారన్నారు. దేశంలో ఐదు కోట్ల మంది పేర్లు తొలగి పోవడం, కర్ణాటకలో 1 లక్షకు పైగా ఓట్లు తొలగి పోవడంతో భవిష్యత్తులో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తుతాయన్నారు. భారత ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను డిిస్మిస్ చేయాలని డిమాండ్ చేశారు.


