ఉల్లిగడ్డల లారీ బోల్తా | - | Sakshi
Sakshi News home page

ఉల్లిగడ్డల లారీ బోల్తా

Nov 5 2026 1:28 AM | Updated on Nov 5 2026 1:28 AM

● డ్రైవర్‌, క్లీనర్లకు తీవ్ర గాయాలు

హుబ్లీ: ఉల్లిగడ్డల లోడ్‌తో వెళుతున్న లారీ డ్రైవర్‌ అదుపు తప్పి పైవంతెన నుంచి కిందకు బోల్తా పడటంతో ఆ లారీ డ్రైవర్‌, క్లీనర్‌ తీవ్రంగా గాయపడిన ఘటన కొప్పళ తాలూకా మునిరాబాద్‌ వద్ద జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని తెలిసింది. లారీ హొసపేటె వైపు నుంచి కుష్టిగి వైపునకు వెళుతుండగా మునిరాబాద్‌ సమీపంలో జాతీయ రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన డ్రైవర్‌, క్లీనర్లను కొప్పళ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించిన మునిరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

వృద్ధురాలికి పసిబిడ్డ

● సోషల్‌ మీడియాలో వ్యూస్‌ కోసం నకిలీ వీడియో హల్‌చల్‌

హుబ్లీ: జిల్లాలోని కలఘటిగి తాలూకా బుగేనాగరకొప్ప గ్రామానికి చెందిన 70 ఏళ్ల వృద్ధురాలు ఫక్కీరమ్మ మగ బిడ్డకు జన్మనిచ్చిన విషయంపై ఓ వీడియో సోషల్‌ మీడియాలో తీవ్రంగా వైరల్‌ అవుతోంది. వీడియోలో సదరు జన్మదాత అయిన వృద్ధురాలు ఫక్కీరమ్మ నాకు బిడ్డను ఆ దేవుడే ఇచ్చాడని చెబుతోంది. కొందరు మహిళలు ఆ వృద్ధురాలిని నానా రకాల ప్రశ్నలు అడుగుతున్నారు. అయితే ప్రస్తుతం నిజాలు వెలుగులోకి రావడంతో లైక్స్‌, వ్యూస్‌, ఫేక్‌ రీల్స్‌ కోసమే ఈ నాటకం ఆడినట్లు తెలిసింది. కలఘటిగి తాలూకా ప్రభుత్వ ఆస్పత్రిలో ఆ వృద్దురాలు తన పక్కన నవజాత శిశువును పెట్టుకొని ఈ వీడియో చేశారు. తానే ఈ బిడ్డకు తల్లిని. దేవుడే కరుణించాడు అని ఆ వృద్ధురాలు మాట్లాడటం ఆ వీడియోలో కనిపించింది. అయితే ఇదంతా బూటకపు రీల్స్‌ వీడియో అని తేలడంతో మండిపడుతున్నారు.

వాల్మీకి జీవితం ఆదర్శప్రాయం

బళ్లారి రూరల్‌ : మహర్షి వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని బళ్లారి దంతవైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ భారతి తెలిపారు. బుధవారం బళ్లారి దంతవైద్య కళాశాల పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన మహర్షి వాల్మీకి జయంతి కార్యక్రమంలో పాల్గొని ఆమె మాట్లాడారు. వాల్మీకి రచించిన మహాగ్రంథం రామాయణం మహత్తరమైనదని తెలిపారు. డాక్టర్‌ ప్రియాంక మాట్లాడుతూ మహర్షి వాల్మీకి తన జీవితంలో సత్యం, ధర్మం, న్యాయం, ప్రేమ, మానవీయ విలువలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చారన్నారు. జయంతిని బీఎంసీఆర్‌సీ డీన్‌ అండ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ మరిరాజ్‌ జీర్‌ ప్రారంభించారు. దంతవైద్య కళాశాల వైద్యులు, వైద్యవిద్యార్థులు పాల్గొన్నారు.

మాదక వస్తువులపై జాగృతి జాతా

రాయచూరు రూరల్‌ : మాదక వస్తువుల బెడదను నియంత్రించాలని జిల్లాధికారిణి పూవిత పిలుపునిచ్చారు. బుధవారం జిల్లా ఆరోగ్యాధికారి కార్యాలయం వద్ద మాదక వ్యసనాల నుంచి విముక్తిపై ఏర్పాటు చేసిన జాగృతి జాతాను ప్రారంభించి ఆమె మాట్లాడారు. యువత డ్రగ్స్‌కు అలవాటు పడరాదన్నారు. జాతాలో ఎస్పీ అరుణాంగ్శు గిరి, జిల్లా ఆరోగ్యాధికారిణి నందిత, డాక్టర్లు రమేష్‌, గణేష్‌, షాకీర్‌, సరోజ, సంధ్య, సురేష్‌ పాల్గొన్నారు.

సర్‌ను సక్సెస్‌ చేయాలి

రాయచూరు రూరల్‌: జిల్లాలో ఓటరు జాబితా వివరాల సేకరణ(సర్‌)ను విజయవంతం చేయాలని జిల్లాధికారిణి పూవిత పేర్కొన్నారు. బుధవారం జిల్లాధికారి కార్యాలయంలో ఓటరు జాబితాలో వివరాల సేకరణ–2027పై అధికారులకు, సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణా శిబిరాన్ని ప్రారంభించి ఆమె మాట్లాడారు. 2011లో జనాభా లెక్కల సేకరణను మాన్యువల్‌గా చేశారని, నేడు డిజిటల్‌ ద్వారా చేపట్టారన్నారు. 10 ఏళ్లకు ఒకసారి జరిగే జనాభా లెక్కల సేకరణలో అధికారులు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. జడ్పీ సీఈఓ ఈశ్వర్‌ కుమార్‌, నోడల్‌ అధికారులు సుదర్శన్‌, బేగం, సోమలింగప్ప, రోణ, నాగేంద్ర, సదాశివప్ప, బసవణ్ణప్ప, గోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement