సాక్షి,బళ్లారి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాలు(ఎస్సీ), షెడ్యూల్డ్ తెగల (ఎస్టీ) పారిశ్రామికవేత్తలకు కల్పిస్తున్న వివిధ రకాల సౌకర్యాలు, ప్రభుత్వం కొనుగోలులో కల్పించిన 4 శాతం రిజర్వేషన్ ప్రయోజనాలు అర్హులైన పారిశ్రామికవేత్తలకు పూర్తిగా చేరడం లేదని మైసూరు ఆటోమోటివ్ ఛాంబర్ ఆఫ్ సంస్థ డైరెక్టర్ ఆర్. మంజునాథ్ పేర్కొన్నారు. ఈనేపథ్యంలో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు యువతను స్వయం ఉపాధి, పారిశ్రామిక రంగం వైపు ప్రోత్సహించాలన్న లక్ష్యంతో ఈనెల 17న నగరంలోని నక్షత్ర హోటల్‌లో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నామన్నారు. బుధవారం నగరంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆ రోజున నిర్వహించే శిబిరంలో నేషనల్ ఎస్సీ, ఎస్టీ హబ్, ఎంఎస్‌ఎంఈ, జిల్లా పరిశ్రమల కేంద్రం(డీఐసీ), పవర్ గ్రిడ్, ఎన్‌ఎండీసీ, ఎఫ్‌సీఐ తదితర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిపుణులైన అధికారులు పాల్గొంటారన్నారు. ఇప్పటికే పరిశ్రమలు, వ్యాపారాలు నిర్వహిస్తున్న వారితో పాటు కొత్తగా పరిశ్రమల స్థాపించాలనే యువకులు శిబిరంలో పాల్గొనాలన్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు కేంద్రం ప్రభుత్వం కొనుగోలు విధానం కింద అందుబాటులో ఉన్న 4 శాతం రిజర్వేషన్ ప్రయోజనాలను ఎలా పొందాలి, టెండర్ల ప్రక్రియలో ఎలా పాల్గొనాలి? అనే అంశాలపై అవగాహన కల్పిస్తామన్నారు. ఒక రోజు శిక్షణ శిబిరానికే పరిమితం కాదని, భవిష్యత్తులో కొత్త పరిశ్రమలను స్థాపించే వారికి తమ సంస్థ పూర్తి సహకారం అందిస్తుందన్నారు. పెట్రోల్ బంక్ యజమాని జోళదరాశి తిమ్మప్ప, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


