హొసపేటె: మహిళలు అన్యాయం, హింస, వేధింపులకు వ్యతిరేకంగా మౌనాన్ని వీడి ధైర్యంగా గళం విప్పాలని కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ నాగలక్ష్మి చౌదరి పిలుపునిచ్చారు. హొసపేటెలోని విజయనగర కళాశాల ప్రాంగణంలో విద్యార్థినులతో నిర్వహించిన ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. మహిళలు జీవితంలో ఎదురయ్యే సవాళ్లు, అవమానాలు, అడ్డంకులకు ఎదురొడ్డి నిలవాలని సూచించారు. నేటి సమాజంలో మహిళలకు విద్య, ఉద్యోగం, పాలన, రాజకీయ తదితర రంగాల్లో ఉన్న ఎన్నో అవకాశాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థానాలకు ఎదగాలన్నారు. నాడు మహిళలను కుటుంబ బాధ్యతలకే పరిమితం చేసేవారు, కానీ నేడు మహిళలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుతున్నారన్నారు. ప్రతి మహిళ ఉన్నత విద్యను అభ్యసించి ఆర్థికంగా స్వతంత్రంగా ఎదగాలన్నారు. ఇతరులపై ఆధారపడకుండా ఆత్మవిశ్వాసంతో జీవించాలన్నారు. మహిళలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే సమాజాభివృద్ధి సాధ్యమన్నారు.
గని బాధిత ప్రాంతాభివృద్ధికి రూ.146 కోట్లు
గని బాధిత ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం రూ.146 కోట్లు కేటాయించిందని మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డాక్టర్ నాగలక్ష్మి చౌదరి పేర్కొన్నారు. ఆమె బుధవారం తాలూకాలోని జంబునాథహళ్లి, కేఎంఏఏ, దాల్మియా క్యాంప్ సహా పలు గని ప్రభావిత ప్రాంతాలను సందర్శించి, అక్కడి పరిస్థితిని పరిశీలించారు. ఈ సమయంలో ఆమె స్థానికులతో మమేకమై వారి సమస్యలు, ఫిర్యాదులను ఆలకించారు.
కర్ణాటక మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నాగలక్ష్మి చౌదరి పిలుపు


