సాక్షి,బళ్లారి: చిరుత దాడి చేసి ఓ వ్యక్తిని దారుణంగా చంపిన ఘటన బుధవారం తెల్లవారుజామున చిత్రదుర్గ జిల్లా చెళ్లకెరె తాలూకా దొడ్డచెల్లూరు గ్రామంలో జరిగింది. గ్రామస్తుడు రామచంద్రప్ప (65) గ్రామ శివారులోని తన ఇంటి నుంచి బయటకు రావడంతో చిరుత ఉన్నఫళంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. దీంతో అక్కడికక్కడే రక్తపు మడుగులో పడిపోయారు. దీంతో గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక పోలీసులు రంగంలోకి దిగి చిరుత కోసం గాలింపు చేపట్టారు. ఈ ప్రాంతంలో చిరుతల దాడులు పెరిగిపోవడంతో రైతులు భయాందోళన చెందుతున్నారు. వ్యవసాయాన్ని నమ్ముకుని పంట పొలాలను కాపాడుకునేందుకు రైతులు పొలాలకు వెళ్లినప్పుడు చిరుతలు దాడి చేస్తున్నాయని రైతులు కన్నీరు పెట్టుకున్నారు. అటవీశాఖ అధికారులు ఈ ప్రాంతంలో చిరుతలను పట్టుకుని లేకుండా చేయాలని కోరుతున్నారు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. వ్యవసాయమే జీవనాధారంగా ఎంచుకుని పంటలు సాగు చేస్తూ పొలంలోనే ఇళ్లు కట్టుకుని జీవించే ఓ రైతు చిరుత దాడిలో మృతి చెందడం గ్రామస్తులను కంటతడి పెట్టించింది.
చెళ్లకెర తాలూకాలో ఘోరం
భయాందోళనలో గ్రామస్తులు


