వీఏఓ పరీక్షల్లో అక్రమాలపై కేసు | - | Sakshi
Sakshi News home page

వీఏఓ పరీక్షల్లో అక్రమాలపై కేసు

Nov 3 2026 12:09 AM | Updated on Nov 3 2026 12:09 AM

హుబ్లీ: గ్రామ పాలన అధికారి (వీఏఓ) పరీక్షల్లో అక్రమాలకు పాల్పడి 151 మార్కులు తెచ్చుకోవడం ద్వారా తొలి ర్యాంక్‌ గడించిన ఆరోపణలపై శంకర్‌ బన్నూరుపై హావేరి జిల్లా శిగ్గాంవి పోలీసులు కేసు నమోదు చేశారు. నియామక పరీక్షలు నిర్వహించిన కర్ణాటక పరీక్ష ప్రాధికార సూచనల మేరకు హావేరి జిల్లాధికారి విజయ మహంతేష్‌ దానమ్మనవర ఆదేశం మేరకు సవణూరు ఏసీ సమీర్‌ కోడె ఐటీ చట్టం– 2000, కర్ణాటక పరీక్ష చట్టం–2023 కింద కేసు దాఖలు చేసుకున్నారు.

ఎఫ్‌ఐఆర్‌లో ఏముందంటే?

అక్టోబర్‌ 4న శిగ్గాంవి డీబీ మాంమ్లే దేశాయి జూనియర్‌ కళాశాల పరీక్ష కేంద్రంలో సంబంధిత పరీక్షకు హానగల్‌ పట్టణం గుడికేరి వీధి యడేపేట నివాసి, నిందితుడు శంకర్‌ బసవరాజ బన్నూరు హాజరయ్యారు. ఆ మేరకు ఉదయం, మధ్యాహ్నం జరిగిన రెండు పరీక్షల్లో కాపీ కొట్టడానికి ఇతడు ఎవరూ గుర్తించని విధంగా మొబైల్‌ లాంటి వస్తువును పరీక్ష గదిలోకి తీసుకెళ్లాడు. దీంతో పాటు పరీక్షల్లో ప్రశ్న పత్రిక ఫోటో తీసి సమాధానాలు తెలుసుకొని ఓఎంఆర్‌ నింపారు. 200 మార్కులకు గాను 151 మార్కులు తెచ్చుకున్నారు. బాధ్యుడిపై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని ఏసీ సమీర్‌ ఫిర్యాదులో పేర్కొన్నారు.

పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్షల్లో 25 మార్కులే

పోలీస్‌ కానిస్టేబుల్‌ పరీక్షల్లో 25 మార్కులు పొందిన శంకర్‌ బన్నూరు వీఏఓ పరీక్షల్లో 151 మార్కులు సాధించి రాష్ట్రానికే టాపర్‌గా నిలవడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. సోషల్‌ మీడియాలో చాలా చర్చలు జరిగిన నేపథ్యంలో కేఈఏ కూడా దర్యాప్తునకు ఆదేశాలు ఇచ్చింది. హావేరి జిల్లాధికారి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. ఆ మేరకు సవణూరు ఏసీ నేతృత్వంలో దర్యాప్తునకు ఆదేశించారు. నేను ఎలాంటి తప్పు చేయలేదని, ఏ దర్యాప్తుకై నా సిద్ధం అని నిందితుడు సమర్థించుకున్నాడు. ఇప్పటికే 45 పరీక్షలను రాశాను. ఒక్కొక్క పరీక్షలో తక్కువ తేడాతో ఉద్యోగం కోల్పోయానని, అందుకే తాను ఎటువంటి దర్యాప్తుకై నా సిద్ధం అని శంకర్‌ ప్రకటించాడు. కేఈఏ ఎగ్జిక్యూటివ్‌ అధికారి ప్రసన్న సూచనల మేరకు సవణూరు ఏసీ విచారణ చేశారు. 2, 3 రోజుల్లో నివేదిక తన చేతికి వస్తుందని, అప్పుడు నిజాలు తెలుస్తాయని జిల్లాధికారి విజయ్‌ మహంతేష్‌ మీడియాకు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement