హుబ్లీ: ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన కే.సుధీర్ భౌతిక కాయం దావణగెరె జిల్లా చెన్నగిరి తాలూకా త్యావణిగి గ్రామానికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరయ్యారు. మాజీ ఎమ్మెల్యే బసవరాజ్ నాయక్, శ్రీనివాస్, చుట్టు పక్కల గ్రామస్తులు బంధువులు, మిత్రులు సుధీర్ అంతిమ దర్శనం చేసుకున్నారు. ఆ గ్రామ సమీపంలోని సుధీర్ సొంత పొలంలోనే హిందూ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలను నెరవేర్చారు. సుధీర్ మెడలోని చైన్, చేతికి ఉన్న ఉంగరం, పరుసు దొరికాయి. మృతదేహం గుర్తించడానికి మరిన్ని వివరాలు కావాల్సింది. మృతుడి సోదరుడు దంత వైద్యుడు కావడంతో కొన్ని నెలల క్రితం సుధీర్ పళ్లకు క్యాప్ వేశారు. ఈ విషయాన్ని అధికారులకు తెలియజేయడంతో మృతదేహాన్ని గుర్తించి బంధువులకు ఇవ్వడానికి అధికారులు అంగీకరించారని తెలిసింది. కాగా తమ కుమారుడి మృతిపై ఆయన తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. మృతుడి తండ్రి మల్లేశప్ప తమ కుమారుడి మృతికి హెలికాఫ్టర్‌ను సక్రమంగా నిర్వహించక పోవడమే కారణమని ఆరోపించారు. దీనికి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. తన కుమారుడు ఎందరికో సహాయం చేశాడని, తన కుమారుడు కూడా ఓ రకంగా దివంగత పునీత్‌రాజ్‌కుమార్ లాంటివాడన్నారు. 49 ఏళ్ల తన కుమారుడు న్యాయమూర్తి కావాలని కలలు కనేవాడన్నారు. తమ ఊరి వారు ఎవరైనా బెంగళూరుకు వెళ్లి సహాయం అడిగితే కాదనేవాడు కాదని భోరుమన్నారు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుమార్తె ఎంబీబీఎస్ చదువుతోంది. ఈ వయసులో కుమారుడి దహనసంస్కారాలు చేయాల్సి రావడం విధి ఆడిన నాటకం, నా మనవళ్లు నా రెండు కళ్లు ఉన్నట్లే. వారిద్దరిని బాగా చూసుకుంటానని ఆయన రోదించారు.


