హొసపేటె: పోలీస్ సిబ్బంది సంక్షేమానికి మరో ముందడుగు పడింది. విధి నిర్వహణలో నిరంతరం ప్రజలకు సేవలందించే పోలీస్ సిబ్బంది, వారి కుటుంబాలకు మెరుగైన గృహ వసతి కల్పించే లక్ష్యంతో హొసపేటెలోని జిల్లా సాయుధ రిజర్వ్ పోలీసు(డీఏఆర్పీ) ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన పోలీస్ నివాస గృహాలను జిల్లా ఇన్చార్జి మంత్రి కే.బసవంతప్ప ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. సుమారు రూ.10.97 కోట్ల వ్యయంతో నిర్మించిన 36 పోలీస్ క్వార్టర్లను అందుబాటులోకి తెచ్చారు. మంత్రి మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది ఎలాంటి పరిస్థితుల్లోనైనా ప్రజల రక్షణ కోసం నిరంతరం విధులు నిర్వహిస్తున్నారన్నారు. వారి సంక్షేమం, కుటుంబ సభ్యుల సౌకర్యం కోసం ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందన్నారు. పోలీస్ సిబ్బందికి నాణ్యమైన నివాస గృహాలు కల్పించడం ద్వారా వారి కుటుంబాలకు భద్రతతో కూడిన ప్రశాంతమైన జీవిత వాతావరణం ఏర్పడుతుందన్నారు. అనంతరం మంత్రి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు నూతనంగా నిర్మించిన నివాస గృహాలను పరిశీలించారు. అక్కడ కల్పించిన సౌకర్యాలు, నిర్మాణ వివరాలను పోలీస్ అధికారులు వారికి వివరించారు. హొసపేటె ఎమ్మెల్యే గవియప్ప, హుడా అధ్యక్షుడు ఇమాం నియాజీ, జిల్లాధికారిణి కవిత మన్నికేరి, జెడ్పీ సీఈఓ గరీమా పన్వర్, ఎస్పీ ఎస్.జాహ్నవి పాల్గొన్నారు.
డీఏఆర్ పోలీసు క్వార్టర్లను ప్రారంభించిన మంత్రి, ఎమ్మెల్యేలు
విజయనగర జిల్లా పోలీసులకు
అందుబాటులోకి కొత్త నివాసాలు


