సాక్షి, బెంగళూరు: ఏపీలో శాంతిభద్రతలు క్షీణించాయని, విద్యార్థినిపై జరిగిన పాశవిక దాడే ఇందుకు ఉదాహరణ అని మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో ఉన్మాది చేతిలో తీవ్రంగా గాయపడి బెంగళూరులోని మణిపాల్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గోపికను వైఎస్ జగన్ సోమవారం పరామర్శించారు. వైద్యులతో మాట్లాడిన ఆయన బాలిక ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. త్వరగా కోలుకునేలా మెరుగైన వైద్యచికిత్సలు అందించాలని వైద్యులకు సూచించారు.
ఏపీలో దారుణ పరిస్థితి
ఈ సందర్భంగా ఆస్పత్రి ముందు వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతపై మండిపడ్డారు. ఏపీలో ఇలాంటి దారుణ పరిస్థితులు నెలకొనడానికి ప్రధాన కారణం వెన్నుపోటు పార్టీ, కూటమి ప్రభుత్వ వైఫల్యమేనని దుయ్యబట్టారు. ప్రతి వీధిలో మద్యం బెల్ట్ షాపులు, గంజాయి దందా సాగుతోందని ఆరోపించారు.
బాలికకు అన్యాయంపై ఆవేదన
తీవ్రంగా గాయపడిన గోపిక ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, దేవుని దయవల్ల చిన్నారి ఆరోగ్య పరిస్థితి క్రమంగా మెరుగుపడుతోందని వైద్యులు చెప్పినట్లు వైఎస్ జగన్ తెలిపారు. చిన్నారికి జరిగిన దారుణాన్ని తలచుకుంటే తీవ్ర ఆవేదన కలుగుతోందని చెప్పారు. బాలిక తల్లి, బంధువులతో జగన్ మాట్లాడారు. ధైర్యంగా ఉండాలని, పాప కోలుకుని ఆరోగ్యంగా తిరిగి వస్తుందని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆస్పత్రి వైద్యులతో జగన్ ప్రత్యేకంగా ఆరా తీశారు. అనంతపురం జిల్లా వైఎస్సార్‌సీపీ సీనియర్ నాయకులు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, ఉషశ్రీ చరణ్, గోరంట్ల మాధవ్ తదితరులు పాల్గొన్నారు. జననేత వస్తున్నట్లు తెలియడంతో వందలాది మంది అభిమానులు తరలిరావడంతో ఆస్పత్రి వద్ద రద్దీ నెలకొంది.
రాప్తాడు పాఠశాలలో
రంపపు దాడికి గురైన బాలిక..
బెంగళూరు ఆస్పత్రిలో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శ
కుటుంబానికి భరోసా
ఈ దాడి ఏపీ ప్రభుత్వ అసమర్థతే అని జననేత మండిపాటు
ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడు జడ్పీ హైస్కూల్‌లో హేమంత్ అనే కిరాతకుడు ఎలక్ట్రిక్ రంపంతో విద్యార్థినిపై రాక్షసంగా దాడికి పాల్పడడం తీవ్ర సంచలనం కలిగిస్తోంది. ఏపీలోని శాంతిభద్రతల పరిస్థితిపై దేశమంతటా చర్చను రేకెత్తించింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బెంగళూరులో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను పరామర్శించి, కుటుంబాన్ని ఓదార్చారు.


