అంబరాన్నంటిన రాజ్యోత్సవ సంబరాలు | - | Sakshi
Sakshi News home page

అంబరాన్నంటిన రాజ్యోత్సవ సంబరాలు

Nov 2 2026 1:59 AM | Updated on Nov 2 2026 1:59 AM

సాక్షి, బళ్లారి: కర్ణాటక రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని (రాజ్యోత్సవం) ఆదివారం నగరంలో ఘనంగా నిర్వహించారు. అన్ని ప్రధాన రహదారులు, కూడళ్లు, వీధుల్లో కన్నడ జెండాలు రెపరెపలాడాయి. భువనేశ్వరి దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు. చిన్నారులు, విద్యార్థులు కన్నడ గీతాలు ఆలపిస్తూ సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. యువత ద్విచక్ర వాహనాల్లో కన్నడ జెండాలు పట్టుకుని సందడి చేశారు. జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నగరంలోని మున్సిపల్‌ హైస్కూల్‌ మైదానంలో కన్నడ రాజ్యోత్సవ సంబరాలు నిర్వహించారు. మంత్రి జమీర్‌ అహమ్మద్‌ ఖాన్‌, ఎమ్మెల్యే నారా భరత్‌రెడ్డి, జిల్లా అధికారి నాగేంద్ర ప్రసాద్‌ పాల్గొని ప్రసంగించారు. రెండు వేల సంవత్సరాలకు పైగా ఘన చరిత్ర కలిగిన కర్ణాణటకలో అన్ని మతాలు, కులాల ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి మెలసి జీవించడం సంతోషంగా ఉందన్నారు. కన్నడ జెండాను ఎగరవేయడం మనందరి పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నామన్నారు. కర్ణాటక రాజ్యోత్సవాలను నెల రోజుల పాటు జరుపుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కన్నడ భాష ఎంతో సరళమైంది అని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు సైతం ఈ భాషను సులభంగా నేర్చుకుని మాట్లాడుతున్నారని తెలిపారు. పేదల సంక్షేమానికి కర్ణాటక ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ఐదు ప్రధాన గ్యారెంటీలతో సంక్షేమ పథకాలు అమలు చేయడం ద్వారా పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న బసవరాజ్‌ జోళదరాశి, హెచ్‌.పి.శికారి రాము, కె.ఎం.మహేశ్వరయ్య స్వామి, రజని లక్కా, హుస్సేన్‌సాబ్‌, యెగానంద రెడ్డి, వీరభద్ర గౌడ, సాదన్న, చలావాది పెద్ద బసప్ప తదితరులను సన్మానించారు.

హంపీ నుంచి కన్నడ జ్యోతి

ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా కన్నడ సంఘాల ఆధ్వర్యంలో హంపీలోని తాయి భువనేశ్వరీ ఆలయం నుంచి కన్నడ జ్యోతిని తీసుకొచ్చి మంత్రి సమక్షంలో జిల్లా యంత్రాంగానికి అందజేశారు.

ఆకట్టుకున్న ఉరేగింపు

కన్నడ రాజ్యోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉరేగింపు నగరవాసులను ఆకట్టుకుంది. పలు శాఖలు, వివిధ కన్నడ సంఘాల ఆధ్వర్యంలో కన్నడ తల్లి భువనేశ్వరి చిత్రపటంతో పాటు కర్ణాటక ఏకీకరణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన పంజార రంజాన్‌ సాబ్‌, తదితరులు చిత్రపటాలు, శకటాలతో భారీ ఉరేగింపు చేపట్టారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సుమన్‌ పన్నేకర్‌, నగర కమిషనర్‌ మంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

భువనేశ్వరి దేవి చిత్రపటానికి పూజలు

కన్నడ రాజ్యోత్సవాన్ని పురస్కరించుకుని పలు కన్నడ సంఘాలు, బీజేపీ కార్పొరేటర్ల ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పాల్గొని కన్నడ జెండా ఎగురవేసి, తాయి భువనేశ్వరి దేవి చిత్రపటానికి పూలమాలలు వేసి పూజలు చేశారు.

కన్నడ జెండాల ఆవిష్కరణ

రాయచూరు రూరల్‌: ఉత్తర కర్ణాటక జిల్లాలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని వేడుకగా జరుపుకున్నారు. బెళతగావిలో మంత్రి సతీష్‌ జార్కిహోళి, బాగల్‌కోటలో మంత్రి విజయానంద కాశప్పనవర, విజయపురలో మంత్రి ఎం.బి.పాటిల్‌, కళ్యాణ–కర్ణాటకలోని కలబుర్గిలో రాష్ట్ర హోం శాఖ మంత్రి ప్రియాంఖ ఖర్గే, యాదగిరిలో రాష్ట్ర వైద్యశాఖ మంత్రి శరణ ప్రకాష్‌ పాటిల్‌, కొప్పళలో మంత్రి శివరాజ తంగడిగి కన్నడ జెండాలను ఎగురవేశారు. భువనేశ్వరి చిత్రపటానికి కిల్లే బ్రహన్మఠాధిపతి శాంతమల్ల శివాచార్యులు పూజలు చేపట్టారు. నగరంలో కన్నడ కళా యువ వేదిక ఆధ్వర్యంలో పతాకాన్ని ఎగురవేసి సమాజ సేవలకులకు అవార్డులు అందజేశారు. కార్యక్రమంలో వినోద రెడ్డి, శివశంకర్‌, శరణప్ప గోనాళ్లు, వెంకట సింగ్‌ పాల్గొన్నారు.

కర్ణాటక ఏకీకరణ రక్షణ సేన సమితి ఆధ్వర్యంలో..

బళ్లారి అర్బన్‌: కర్ణాటక ఏకీకరణ రక్షణ సేన సమితి ఆధ్వర్యంలో కర్ణాటక రాజ్యోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆ సమితి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ.. కర్ణాటక ఏకీకరణ కోసం పోరాడిన మహనీయుల ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్ర ఐక్యతను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు పి.శేఖర్‌, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు ఎస్‌.రోహన్‌, జిల్లా కార్యనిర్వహక అధ్యక్షుడు శివరాం, సాగర్‌, చంద్ర తదితరులు పాల్గొన్నారు.

దావణగెరెలో..

బళ్లారి రూరల్‌: కన్నడ నాడు, నుడి అభివృద్ధికి అందరూ కృషి చేయాలని దావణగెరె జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి, ఎస్‌.ఎస్‌.మల్లికార్జున తెలిపారు.

కన్నడ రాజ్యోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్రీడా మైదానంలో కన్నడ జెండా ఆవిష్కరించారు. ఆలూరు వెంకటరాయరు, కెంగల్‌ హనుమంతయ్య, ఎస్‌.నిజలింగప్ప, తదితర మహనీయుల సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, కలెక్టర్‌, ఎస్పీ, వివిధ శాఖల అధికారులు, పాల్గొన్నారు.

రాజ్యోత్సవ వేడుకలకు హాజరైన మంత్రి అజయ్‌ సింగ్‌

కన్నడ జ్యోతిని అధికారులకు అందజేస్తున్న ఎమ్మెల్యే నారాభరత్‌ రెడ్డి

రాయచూరు రూరల్‌: బాగల్‌కోటలో రాజ్యోత్సవ వేడుకలు

వాడవాడలా కర్ణాటక

ఆవిర్భావ దినోత్సవం

కన్నడ జెండాలతో కళకళలాడిన వీధులు

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు, ర్యాలీలు, అన్నదానాలు

జిల్లాభివృద్ధికి శ్రమిస్తాం: మంత్రి సింగ్‌

రాయచూరు రూరల్‌: జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర చిన్న నీటి పారుదల శాఖ మంత్రి అజయ్‌ సింగ్‌ వెల్లడించారు. 71వ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మహాత్మా గాంధీ క్రీడా ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా అధికారి పూవిత, ఎస్పీ అరుణాంగ్శుగిరి, జెడ్పీ సీఈఓ ఈశ్వర్‌ కుమార్‌ కాందూ, సమాచార హక్కు కమిషనర్‌ వెంకట సింగ్‌ తదితరులు పాల్గొన్నారు. నగరంలో వివిధ రంగాల్లో సేవలందించిన వారికి ఏడదొరె నాడు అవార్డులు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement