రాయచూరు రూరల్: కల్యాణ కర్ణాటక ప్రాంతంలోని ఏడు జిల్లాల్లో భూగర్భ జలాల పెంపునకు రూ.300 కోట్ల నిధులు కేటాయించినట్లు రాష్ట్ర చిన్న నీటిపారుదల శాఖ మంత్రి అజయ్ సింగ్ వెల్లడించారు. ఆదివారం మహాత్మా గాంధీ క్రీడా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్యాణ కర్ణాటక అభివృద్ధి మండలి నుంచి రూ.100 కోట్లు, చిన్న నీటిపారుదల శాఖ నుంచి రూ.100 కోట్లు, గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి మరో రూ.100 కోట్లు సమీకరించి నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు కృషి చేస్తామని తెలిపారు. రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 75 మంది అధ్యాపకుల నియామకాల్లో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న విశ్రాంత వైస్ చాన్సలర్ హన్మంతప్పపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. రాయచూరులోని ప్రైవేటు వైద్య కళాశాలకు మృతదేహాలను అప్పగిస్తున్న అంశంపై కళాశాల యాజమాన్యాలపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ పూవిత, ఎస్పీ అరుణాంగ్షు గిరి, సీఈఓ ఈశ్వర్ కుమార్ కాందూ, నగరసభ కమిషనర్ జుబీన్ మెహపాత్రో పాల్గొన్నారు.


