హొసపేటె: హామీలతో కాలయాపన చేయకుండా చక్కెర కర్మాగారం ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. ఆదివారం హొసపేటె చక్కెర కర్మాగార స్థాపన సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మంత్రి బసంతప్ప, ఎమ్మెల్యే గవియప్పకు వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సంఘం నేత జంబయ్య నాయక్ మాట్లాడుతూ.. హొసపేటతో పాటు పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో రైతులు చెరకు సాగు చేస్తున్నారని తెలిపారు. ఇక్కడ చక్కెర కర్మాగారం లేకపోవడంతో పండించిన చెరకును దూర ప్రాంతాల్లోని కర్మాగారాలకు తరలించాల్సి వస్తోందన్నారు. రవాణా ఖర్చులు పెరగడంతో పాటు రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. మూడేళ్లుగా చక్కెర కర్మాగారం ఏర్పాటుకు నిరంతరం పోరాటం చేస్తున్నామని తెలిపారు. ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందజేసినా ఫలితం లేకుండా పోయిందని మండిపడ్డారు. హామీలు ఇస్తున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం ఎలాంటి పురోగతి లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.


