రాయచూరు రూరల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన చెరకు, కంది పంటలకు టన్నుకు రూ.5,500 ధర కేటాయించాలని రైతులు డిమాండ్ చేశారు. శనివారం బెళగావి జిల్లాలోని అథణి, బాగలకోటె జిల్లా జమఖండి, కలబుర్గి జిల్లా జేవర్గి వద్ద విజయపుర, కలబుర్గి జిల్లాల రైతులతో కలసి ఆందోళన చేపట్టారు. ఆందోళనలో సంచాలకులు లఛ్చన్న పూజారి మాట్లాడారు. కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో రైతులు జరిపిన చర్చలు విఫలం కావడంతో వారం రోజుల నుంచి రైతులే రహదారులను బంద్ చేసి నిరసన వ్యక్తం చేస్తున్నారన్నారు. స్వామినాథన్ కమిషన్ నివేదికను జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేస్తున్న రైతులకు గ్రామాల నుంచి ప్రజలు స్వచ్ఛందంగా భోజనాలు అందించారు. రైతులు అర్ధ నగ్న ప్రదర్శనతో రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు.


