రాయచూరు రూరల్ : తాళికోటెలో వైభవంగా ఖాస్గతేశ్వర అజ్జ ఉత్సవాలు జరిగాయి. శుక్రవారం రాత్రి మఠాధిపతి ఖాస్గతేశ్వర ఉత్సవాలకు తెరదించారు. ఆలయంలో ప్రతిమకు ప్రత్యేకంగా పూజలు జరిపారు. వందలాది మంది భక్తులు విశేష పూజలు చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. రాత్రి వేళ రథోత్సవం నిర్వహించారు.
మత్తు పదార్థాలకు
కళ్లెం వేయండి
రాయచూరు రూరల్: మాదక వస్తువుల నియంత్రణకు సహకరించాలని జిల్లా ఎస్పీ అరుణాంగ్షు గిరి పిలుపునిచ్చారు. శనివారం క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన ఏకతా దివస్ సందర్భంగా మాదక వ్యసనాల నుంచి విముక్తిపై ప్రచారాందోళన కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడారు. యువకులు డ్రగ్స్‌కు, ఇతర దురలవాట్లకు గురై ఉజ్జ్వల భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారన్నారు. యువకులు గంజాయి, హఫీం వంటి వాటికి బానిస కారాదన్నారు.
పెంచిన పాల ధరను తగ్గించండి
రాయచూరు రూరల్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నఫళంగా పెంచిన పాల ధరను తగ్గించాలని ఎస్‌యూసీఐ డిమాండ్ చేసింది. శనివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద చేపట్టిన ఆందోళనలో జిల్లాధ్యక్షుడు మహేష్ మాట్లాడారు. రాష్ట్రంలో తుగ్లక్ పాలన కొనసాగుతోందని, ప్రజలపై లేనిపోని భారాలు మోపడంతో మధ్యతరగతి, పేదలు నలిగి పోతున్నారని దుయ్యబట్టారు. పాల ధర పెంపుతో పాటు అదనంగా బస్సులో ప్రయాణించే ప్రయాణికుల టికెట్ ధరలను పెంచడానికి చేస్తున్న ప్రతిపాదనలను కూడా విరమించుకోవాలని కోరుతూ స్థానిక అధికారికి వినతిపత్రం సమర్పించారు.
సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి
రాయచూరు రూరల్: నగరంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, ఏకతా యాత్ర దినోత్సవాలు జరిగాయి. శనివారం పటేల్ రోడ్డులోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రతిమకు జిల్లాధికారిణి పూవిత, ఎస్పీ అరుణాంగ్శు గిరి, సీఈఓ ఈశ్వర్ కుమార్ పూలమాలలు వేశారు. అనంతరం జిల్లాధికారిణి ఏకతా యాత్రను ప్రారంభించారు. నగరసభ కార్యాలయంలో నగరసభ కమిషనర్ జుబీన్ మహాపాత్రో, వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో, తాలూకా పంచాయతీ, గ్రామ పంచాయితీ కార్యాలయాల్లో, దిన్ని పాఠశాలలో ఏకతా దినోత్సవం జరిగింది. బీజేపీ కార్యాలయంలో జిల్లాధ్యక్షుడు వీరనగౌడ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి ఆయన చేసిన సేవలను కొనియాడారు.


