హొసపేటె: భారత మాజీ ప్రధానమంత్రి, దేశ తొలి మహిళా ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 43వ వర్ధంతి కార్యక్రమాన్ని హొసపేటెలో బ్లాక్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని మున్సిపల్ హైస్కూల్ మైదానం సమీపంలో ఉన్న ఇందిరాగాంధీ ప్రతిమకు కాంగ్రెస్ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. హొసపేటె బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కే.రవికుమార్ నాయకత్వం వహించి మాట్లాడుతూ భారత రాజకీయ చరిత్రలో ఇందిరాగాంధీకి ప్రత్యేకమైన స్థానం ఉందన్నారు. దేశాభివృద్ధి, ఆర్థిక స్వావలంబన, పేదల సంక్షేమ కోసం ఆమె చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. దేశ సమగ్రత, ఐక్యత కోసం ఆమె చూపిన ధైర్యం, నాయకత్వం నేటి తరానికి స్పూర్తిదాయకమని అన్నారు. దేశానికి ఎన్నో కీలక నిర్ణయాలు అందించిన ఇందిరాగాంధీ సేవలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
రాయచూరులో..
రాయచూరు రూరల్: వెనుక బడిన వర్గాల అభ్యున్నతికి పాటు పడిన ఆదర్శ వ్యక్తి ఇందిరాగాంధీ నగరసభ మాజీ సభ్యుడు జయన్న అన్నారు. శనివారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ వర్ధంతి, మాజీ ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, ఏకతా దివస్ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నేతల చిత్రపటాలకు పూలమాలలు వేసి మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం కోసం అహర్నిశలు శ్రమించిన మహానుభావుడు, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో ఇద్దరూ సామాన్య ప్రజల బాధలను పరిష్కరించేందుకు ఎన్నో పథకాలను అమలు చేశారన్నారు. వారి ఆదర్శాలను ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు. రుద్రప్ప, శివమూర్తి, అమరేగౌడ, జయంత్ పతంగి, విశ్వనాథ్, శశికళ, నరసింహులున్నారు.


