హొసపేటె: అవినీతి రహిత సమాజ నిర్మాణంలో యువత పాత్ర అత్యంత కీలకమని కేఎన్.మల్లికార్జున పిలుపునిచ్చారు. అవినీతి దేశాభివృద్ధికి ప్రధాన అడ్డంకిగా మారడమే కాకుండా సమాజంలో అసమానతలు, అన్యాయాలు పెరగడానికి కారణమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కమలాపురలోని హంపీ విరుపాక్షేశ్వర స్వామి డిగ్రీ కళాశాలలో రెడ్‌క్రాస్ యూనిట్, జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్), విద్యార్థి సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన అవినీతి అవగాహన వారోత్సవాల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిఽథిగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ విధులను నిజాయితీగా నిర్వర్తించాలని, విద్యార్థులు లంచాలు ఇవ్వడం, తీసుకోవడం వంటి అవినీతి చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. నేటి విద్యార్థులే రేపటి బాధ్యతగల పౌరులని, చిన్ననాటి నుంచే నైతిక విలువలను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపాల్ వైపీ.నటరాజ్ మాట్లాడుతూ విద్య కేవలం డిగ్రీలు పొందడానికి మాత్రమే కాకుండా, మంచి వ్యక్తిత్వం, నైతిక విలువలను పెంపొందించే సాధనంగా ఉండాలని అన్నారు. నిజాయితీ, పారదర్శకత ప్రతి విద్యార్థి జీవితంలో భాగం కావాలని అన్నారు. విద్యార్థి సంక్షేమ శాఖ సమన్వయకర్త డాక్టర్ సురేంద్ర మాట్లాడుతూ అవినీతి కేవలం ఆర్థిక నేరం మాత్రమే కాదని, సమాజంలోని నైతిక, మానవ విలువలను బలహీనపరిచే మహమ్మారి అని అభివర్ణించారు. విద్యార్థులు విద్యాభ్యాస దశ నుంచే క్రమశిక్షణ, నిజాయితీ, బాధ్యతాయుత ప్రవర్తనను అలవర్చుకోవాలని సూచించారు.


