సాక్షి,బళ్లారి: రాష్ట్ర ప్రభుత్వం పాల ధరను లీటరుకు రూ.8 పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ బీజేపీ ఆందోళన చేపట్టింది. శనివారం బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. రాయల్ సర్కిల్ నుంచి జిల్లాధికారి కార్యాలయం వరకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు చేరి ర్యాలీ చేపట్టి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన పాల ధర పెంపు నిర్ణయం ప్రజావ్యతిరేకమని మండిపడ్డారు. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు కూడా అమాంతంగా పెరిగి సామాన్య, మధ్య తరగతి కుటుంబాల జీవితం అస్తవ్యస్తంగా మారిందన్నారు. పాల ధర పెరిగితే పెరుగు ధర కూడా పెరుగుతుందన్నారు. అన్ని వర్గాల వారు నిత్యం ఉపయోగించే పాల ధరను పెంచితే సామాన్యులు బతుకు బండి లాగడం మరింత కష్టంగా మారుతుందన్నారు. ఇప్పటికే విధాన పరిషత్ ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేసినా బుద్ధి రాలేదన్నారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భారం మోపితే సహించేది లేదన్నారు. పాల ధర పెంపును తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు అనిల్‌కుమార్ మోకా, పాలికె ప్రతిపక్ష నాయకుడు శ్రీనివాస్ మోత్కూర్, బీజేపీ మహిళా మోర్చా ప్రముఖులు సుగుణ, హంపీ రమణ తదితరులు పాల్గొన్నారు.


