● నకిలీది అని నిర్ధారణ
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో ఆకతాయిలు విసిరేసిన నకిలీ పేలుడు వస్తువు ప్రజలకు భయాందోళన కలిగించింది. జ్ఞానభారతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని సొణ్ణేనహళ్లిలో విజయ ఆస్పత్రి వెనుక శనివారం ఉదయం బాంబును పోలిన వస్తువును చూసిన జనం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, బాంబు స్క్వాడ్‌తో వచ్చి పేలుడు వస్తువును స్వాధీనం చేసుకుని పరిశీలించారు. ఇంటర్నెట్‌లో కనిపించే ఫోటోల్లో మాదిరిగా పైపు ముక్కలకు టేప్ చుట్టి వాటికి రెండు వైర్లు అతికించి బాంబు తరహాలో తయారు చేశారు. మొదట పోలీసులు కూడా నిజమైన బాంబే అని అనుకున్నారు. చివరకు అంతా ఉత్తిదే అని చెప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఎవరు తయారు చేశారు, ఎవరు పడేశారో తెలుసుకునేందుకు సీసీ కెమెరాల దృశ్యాలు పరిశీలిస్తున్నారు.
ముగ్గురు యువకుల బలి
● బైక్‌ని ఢీకొన్న గుర్తుతెలియని వాహనం
● కారటగి వద్ద ఘోరం
సాక్షి, బళ్లారి: గుర్తు తెలియని వాహనం బైక్‌ని ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషాద ఘటన కొప్పళ జిల్లా కారటగి తాలూకా సిద్దాపుర గ్రామం వద్ద రాష్ట్ర రహదారిపై జరిగింది. కొప్పళ జిల్లా సిద్ధాపుర గ్రామానికి చెందిన సందీప్ తుళజప్ప (20), మంజునాథ సాకప్ప (23), శివరాజ్ శివప్ప (19)లు చనిపోయారు. పోలీసులు, స్థానికుల ప్రకారం కారటిగి వైపు నుంచి వేగంగా వస్తున్న ఓ గూడ్స్ వ్యాన్ వీరి బైక్‌ని ఢీకొని దూసుకెళ్లింది. ప్రమాద తీవ్రతకు ముగ్గురూ రోడ్డుపై పడిపోగా, తీవ్ర రక్తగాయాలయ్యాయి. అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. గూడ్స్ వ్యాన్ ఆపకుండా పరారైనట్లు పోలీసులు వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనపై కారటిగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బయటకు వెళ్లిన తమ బిడ్డలు ఇక లేరని తెలిసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరయ్యారు. ఆ ప్రాంతం శోకసంద్రంగా మారిపోయింది.
మంటల్లో సిటీ బస్సు
దొడ్డబళ్లాపురం: బెంగళూరు కోరమంగలలోని తావరెకెరె జంక్షన్‌లో శనివారం మధ్యాహ్నం బీఎంటీసీ బస్సులో మంటలు చెలరేగాయి. అదృష్టవశాత్తు బస్సులో ఉన్న ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. కదులుతున్న బస్సులో హఠాత్తుగా దట్టమైన పొగ ఆవహించి వెంటనే మంటలు వ్యాపించాయి. ముందే అప్రమత్తమైన డ్రైవర్, కండక్టర్ ప్రయాణికులను కిందకి దించేశారు. మంటలు చెలరేగడానికి గల కారణాలు తెలియరాలేదు.
శివం స్కాంలో
రూ.427 కోట్ల జప్తు
బనశంకరి: పెట్టుబడిదారులకు పెద్ద మొత్తంలాభం ఇస్తానని నమ్మించి రూ.2,459 కోట్లు స్వాహా చేసిన కుంభకోణంలో బెళగావికి చెందిన శివం అసోసియేట్స్ సంస్థ చీఫ్ శివానంద సిద్దప్ప నీలణ్ణవర్ సంస్థలకు చెందిన రూ.427 కోట్ల విలువచేసే చరాస్తి, స్థిరాస్తులను ఈడీ అధికారులు జప్తుచేశారు. వివిధ బ్యాంకుల్లో ఉన్న రూ.367.77 కోట్ల ఎఫ్‌డీలు, రూ.44.37 కోట్ల నగదు, రూ.13.68 కోట్ల విలువైన 42 ఎకరాల పొలాలు, అపార్టుమెంట్ తదితరాలను సీజ్ చేశారు. భారీ వడ్డీ ఇస్తానంటూ బెళగావి, ధార్వాడ తదితర జిల్లాల్లో ప్రజలు, ఆర్మీ సిబ్బంది నుంచి వేలాది కోట్లను వసూలు చేసి బోర్డు తిప్పేశాడని కేసులున్నాయి.
రెండోరోజు భక్తజన సాగరం
యశవంతపుర: హాసనాంబ దేవి దర్శనం కోసం రెండో రోజు భక్తులు భారులు తీరారు. శుక్రవారం అర్ధరాత్రి నుంచి భక్తులతో క్యూలైన్లు నిండిపోయాయి. రూ.మూడు వందల టికెట్ల కోసం భక్తులు కిలోమీటర్ల మేర క్యూలో నిలబడ్డారు. ఉదయం ఆరు గంటల నుంచి అమ్మవారి దర్శనానికి అవకాశం కల్పించారు. రూ. వెయ్యి టికెట్ల క్యూలైన్ మాత్రం ఖాళీగా కనిపించింది.


