మండ్య: మండ్య జిల్లాలోని శ్రీరంగపట్నం తాలూకాలోని బెళగోళ సమీపంలో స్నేహితులతో కలిసి ఈతకు వెళ్లిన ఇద్దరు విద్యార్థులు వరుణ కాలువలో మునిగిపోయారు. మైసూరుసిటీకి చెందిన పార్థసారథి (20), నంజనగూడువాసి అర్జున్ (20) మరణించారు. వీరు మైసూరులోని ఎన్‌ఐఈ కళాశాలలో మూడవ సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు. బెళగొళలో వర్క్‌షాప్‌కు వచ్చారని తెలిసింది. వరుణ కాలువలో ఆడుకుంటూ నీటిలో మునిగిపోయారు. కేఆర్‌ఎస్ పోలీసులు, ఫైర్ సిబ్బంది కాలువలో నీటిని తగ్గించి గాలించగా మృతదేహాలు లభించాయి.
కాంగ్రెస్ నుంచి
కృపా ఆళ్వా బహిష్కారం
శివాజీనగర: ‘కృపా ఆళ్వా కారణంగా మీడియాలో వచ్చిన అవాంఛనీయ కథనాలు నాయకులను ఇబ్బంది పెట్టాయి. ఈ విషయమై షోకాజ్ నోటీసు జారీ చేసి స్పందించడానికి ఆమెకు 3 రోజుల గడువు ఇచ్చాం. ఆమె స్పందించనందున ఆరేళ్లపాటు ఆ పార్టీ నుంచి బహిష్కరించడమైనది’ అని కేపీసీసీ అధ్యక్షుడు బీ.కే.హరిప్రసాద్ తెలిపారు. శనివారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ కృపా ఆళ్వాకు పంపిన నోటీస్ వెనుతిరిగి వచ్చింది. అందుచేత విధిలేక ఈ చర్యలు తీసుకోవడమైనదన్నారు. కృపా ఆళ్వా విదేశాలకు వెళ్లిన విషయాన్ని ఐబీ, సీబీఐ చూసుకొంటాయన్నారు. చర్యల విషయంలో తొందరబాటు లేదన్నారు. కృపా ఆళ్వా కు వ్యతిరేకంగా ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నందున ఆమెను బహిష్కరించామని తెలిపారు.
స్టింగ్ వీడియోలో
జేడీఎస్ ఎమ్మెల్యే
యశవంతపుర: హాసన్ జేడీఎస్ ఎమ్మెల్యే స్వరూప్ ప్రకాశ్ స్టింగ్ ఆపరేషన్ వీడియోలో కనిపించడం సంచలనమైంది. ఓ కాంట్రాక్టరుతో కమీషన్ ఇవ్వాలని మాట్లాడుతున్నట్లు అందులో ఉంది. దీంతో వివరణ ఇవ్వాలని పార్టీ హైకమాండ్ నోటీసులు పంపింది. ఇది వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌గా మారింది. వివరణ వచ్చాక పార్టీ చర్యలు తీసుకునే అవకాశముంది.
వెజ్ బిర్యానీలో చికెన్ ముక్కలు
దొడ్డబళ్లాపురం: బెంగళూరు కెంపేగౌడ విమానాశ్రయంలో రెస్టారెంట్లు, క్యాంటీన్ల గురించి తరచూ ఆరోపణలు వస్తుంటాయి. తాజాగా ఓ రెస్టారెంట్‌లో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేయగా అందులో చికెన్ ముక్కలు వచ్చాయి. దీంతో సదరు కస్టమర్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పీయూష్ అగర్వాల్ అనే వ్యక్తి కుటుంబ సమేతంగా రెస్టారెంట్‌లో వెజ్ బిర్యానీ ఆర్డర్ చేసి ఆరగిస్తుండగా చికెన్ పీసులు రావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. దీనిపై సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశాడు. ఈ హోటల్‌పై ఆహార భద్రతాధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశాడు.
డిస్టిలరీ స్థాపనకు
గ్రాంట్ తెప్పించగలరా?
● కేంద్ర మంత్రి కుమారస్వామికి సవాల్
మండ్య: జిల్లా ప్రజల సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే మైషుగర్‌లో డిస్టిలరీని స్థాపించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 250 కోట్ల గ్రాంటును అందించి, జిల్లా ప్రజల రుణం తీర్చాలని జలవనరుల, జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎన్. చెలువరాయస్వామి కేంద్ర మంత్రి హెచ్.డి. కుమారస్వామికి సవాలు విసిరారు. నగరంలోని మండ్య విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో జరిగిన వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం, లబ్ధిదారులకు ప్రభుత్వ ప్రయోజనాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. మీ ద్వారా ఏ పనీ జరగదని, ఏ పనీ చేయకుండా కేవలం విమర్శిస్తూనే మీ సమయాన్ని గడుపుతున్నారని కుమారస్వామిపై ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం మండ్య జిల్లా అభివృద్ధికి ఇచ్చిన రూ.10వేల కోట్లపై కుమారస్వామి లెక్కలు అడగడంపై మంత్రి మండిపడ్డారు.


