సాక్షి, బళ్లారి: మామూలు మహిళలుగానే బస్సులోకి ఎక్కుతారు. ఎవరు కాస్త అమాయకంగా కనిపిస్తే వారి నుంచి బంగారం, డబ్బు కొట్టేయడంలో ఈ మహిళా దొంగలు ఆరితేరినవారు. ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల దృష్టి మళ్లించి బంగారు నగలు చోరీ చేసే ఇద్దరు కుప్పం మహిళా దొంగలను అరెస్టు చేసి రూ.17 లక్షల విలువైన బంగారాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు.. బళ్లారి ఏపీఎంసీ యార్డు పోలీసు స్టేషన్ పరిధిలో నమోదైన కేసులో చిత్రదుర్గం జిల్లా మొళకాల్మూరు తాలూకావాసి యల్లమ్మ 2026 మార్చి 13న రాంపురం నుంచి బళ్లారికి కేఎస్‌ఆర్‌టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఆమె బ్యాగులో దాదాపు రూ.14 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు, నగదును చోరీ చేశారు. పోలీసులు విచారణ జరిపి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కుప్పం పట్టణానికి చెందిన ఎం.భువన ఈ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.
మరో కేసులో..
2025 సెప్టెంబర్ 3వ తేదీన పార్వతమ్మ అనే మహిళ బళ్లారి కొత్త బస్టాండు నుంచి మంగళూరుకు కేఎస్‌ఆర్‌టీసీ బస్సులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో 4.5 తులాల బంగారు గొలుసు మాయమైంది. ఈ కేసులోనూ సీసీ కెమెరాలు, పలు ఆధారాలతో గాలించి కుప్పం పట్టణానికి చెందిన రూప (36) అనే మహిళ చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. రూప, భువనను అరెస్టు చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. అనేక చోరీలకు పాల్పడినట్లు విచారణలో తెలిపారు.
ఏపీలోని కుప్పం మహిళా దొంగల హల్‌చల్
బళ్లారిలో రెండు కేసుల్లో ఇద్దరి అరెస్టు
రూ.17 లక్షల సొత్తు స్వాధీనం


