1న ఢిల్లీ నిరసనలో పాల్గొనడం లేదు | - | Sakshi
Sakshi News home page

1న ఢిల్లీ నిరసనలో పాల్గొనడం లేదు

Oct 31 2026 6:14 AM | Updated on Oct 31 2026 6:14 AM

● సీఎం డీకే శివకుమార్‌

శివాజీనగర: బెంగళూరులో కర్ణాటక రాజ్యోత్సవాన్ని విభిన్నంగా జరుపుకుంటున్నందువల్ల నవంబర్‌ 1న ఢిల్లీలో సర్‌కు వ్యతిరేకంగా జరగనున్న భారీ నిరసనలో తాను, తన కేబినెట్‌ సహచరులు పాల్గొనలేకపోతున్నామని సీఎం డీకే శివకుమార్‌ తెలిపారు. శుక్రవారం విధానసౌధలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇలా స్పందించారు. పార్టీ తరపున రాష్ట్ర, జిల్లా కాంగ్రెస్‌, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొంటారని ఆయన తెలిపారు.

ఇన్‌చార్జి మంత్రులు జిల్లాల్లో జెండా ఎగురవేస్తారు

రాజ్యోత్సవం సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి మంత్రులు తమ జిల్లాల్లో జెండా ఎగురవేస్తారని, ఎమ్మెల్యేలు పాల్గొంటారని ఆయన తెలిపారు. అనారోగ్యం కారణంగా ఉప ముఖ్యమంత్రి డాక్టర్‌ జీ.పరమేశ్వర్‌కు విశ్రాంతి అవసరమని, ఆయన స్థానంలో మంత్రి కృష్ణభైరేగౌడ జెండా ఎగురవేస్తారని ఆయన వివరించారు. రాజ్యోత్సవ అవార్డులను ఎంతమందికి ఇవ్వాలనేది ఖరారు చేశారా? అని అడుగగా, మనం ఎన్నేళ్ల నుంచి రాజ్యోత్సవాలు జరుపుకుంటున్నామో అంతమందికి పురస్కారాలు అందించడం గతంలో నుంచి వస్తున్న సంప్రదాయం. ఈసారి కూడా దానినే కొనసాగిస్తాం అన్నారు.

పాల ధర పెంపులో రూ.7 రైతులకు:

పాల ధరను రూ.12 మేర పెంచాలన్న డిమాండ్‌ వచ్చింది. అయితే మేం దానిని రూ.8కి పెంచాం. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో పాల ధరలు అధికంగా ఉన్నందున తమ రాష్ట్ర పాలను పొరుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాం. పాల ధరల పెంపుపై శాసనసభ, శాసనమండలిలో కూడా చర్చ జరిగింది. పెంచిన మొత్తంలో కేవలం రూ.1 మాత్రమే యూనియన్ల నిర్వహణకు ఇస్తుండగా, మిగిలిన రూ.7లను రైతులకు ఇస్తున్నామని సీఎం తెలిపారు. ప్రతిపక్షాలు దీనిని ధరల పెంపు ప్రభుత్వం అని అంటున్నాయా అని ప్రశ్నించగా, మేం కేంద్రం ఏం చేస్తుందో దానినే అనుసరిస్తున్నామని ఆయన అన్నారు.

మహిళ అనుమానాస్పద మృతి

దొడ్డబళ్లాపురం: వివాహిత మహిళ ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన బెళగావిలోని ఆనందనగర్‌లో చోటు చేసుకుంది. పూనం అమిత్‌ డోలేకర్‌(33) మృతురాలు. పూనం భర్త అమిత్‌ కువైట్‌లో పని చేస్తున్నాడు. ఆమె బెళగావిలో ఓ ప్రైవేటు కంపెనీలో పని చేస్తోంది. ఈక్రమంలో గత కొంత కాలంగా పూనంకు రంజన్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని సమాచారం. అతడి కోసమే ఆమె స్వంత ఇల్లు ఉన్నా అతడికి దగ్గరగా ఉండేందుకు అద్దె ఇంట్లో ఉంటోంది. కాగా గురువారం అర్ధరాత్రి రంజన్‌ పూనం కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేసి పూనం ఉరి వేసుకుందని చెప్పాడు. అయితే రంజనే పూనంను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఆ ఆరోపణలకు బలం చేకూరుస్తూ ఇంట్లో పార్టీ చేసుకున్నట్టు మద్యం బాటిళ్లు కూడా లభించాయి. పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మరణంలోనూ

ఇద్దరికి ప్రాణదానం

● అవయవదానంతో యువతి జీవితం సార్థకం

కోలారు: అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ మరణించిన కేజీఎఫ్‌కు చెందిన శ్వేత (28) అవయవ దానంతో జీవితం సార్థకమైంది. తద్వారా ఇద్దరికి ప్రాణదానం లభించింది. ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోన్న శ్వేత ఇటీవల తీవ్ర అనారోగ్యంతో బెంగళూరులోని ఫోర్టిస్‌ ఆస్పత్రిలో చేరింది. ఆమెకు వైద్యులు చేసిన చికిత్స ఫలించలేదు. చివరికి వైద్యులు బ్రెయిన్‌ డెడ్‌ అయినట్లు ధ్రువీకరించారు. కుమార్తె మృతితో పుట్టెడు దుఃఖంలో ఉన్నా ఆమె తల్లిదండ్రులు మానవత్వంతో కీలక నిర్ణయం తీసుకున్నారు. కుమార్తె అవయవాలను దానం చేయడానికి సమ్మతించారు. శ్వేత కాలేయం, గుండె కవాటాలను దానం చేశారు. కాగా శ్వేత తల్లిదండ్రుల నిర్ణయాన్ని వైద్య ఆరోగ్య శాఖా మంత్రి యూటీ ఖాదర్‌ ప్రశంసించారు.

సిట్‌ అధికారుల ఎంపికపై అభ్యంతరం

● నవంబరు 2కు తీర్పు రిజర్వు చేసిన హైకోర్టు

బనశంకరి: పశువైద్యాధికారుల నియామక కుంభకోణంపై దర్యాప్తునకు సిట్‌ ఏర్పాటు చేయడంపై శుక్రవారం హైకోర్టులో విచారణ జరిగింది. సిట్‌ నియామకానికి ప్రభుత్వం సూచించిన అధికారుల గురించి పిటిషనర్‌, న్యాయవాది గిరీశ్‌ భరద్వాజ్‌ అభ్యంతరం తెలిపారు. న్యాయమూర్తి నాగప్రసన్నతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టగా సిట్‌ పోలీస్‌ స్టేషన్‌కు హోదా కల్పించారని అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) శశికిరణ్‌శెట్టి హైకోర్టుకు తెలిపారు. ఈ సమయంలో రాష్ట్రంలో ఎంత మంది ఏడీజీపీ ర్యాంక్‌ అధికారులు ఉన్నారు? అని హైకోర్టు ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. రాష్ట్రంలో 16 మంది ఏడీజీపీ ర్యాంక్‌ అధికారులు ఉన్నారని ఏజీ బదులిచ్చారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ప్రభుత్వం నలుగురు అధికారులను సూచించగా, వారిలో ఇద్దరు అధికారులపై పిటిషనర్‌ అభ్యంతరం తెలిపారు. దీంతో సిట్‌ ఏర్పాటుకు సంబంధించి తెలిపిన అభ్యంతరాలపై వాదనలు ఆలకించిన కోర్టు నవంబరు 2వ తేదీకి తీర్పును రిజర్వు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement