శివాజీనగర: దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా వల్ల కలిగే వాయు, శబ్ద కాలుష్యాన్ని నివారించేందుకు ఆరోజు రాత్రి 8 నుంచి 10 గంటల మధ్య మాత్రమే కాల్చడానికి అవకాశం కల్పించినట్లు రాష్ట్ర పర్యావరణ శాఖ మంత్రి రామలింగారెడ్డి పేర్కొన్నారు. దీపావళి సందర్భంగా బాణసంచా వల్ల కలుగుతున్న పర్యావరణ కాలుష్యంపై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్దేశించిన సమయం దాటి బాణసంచా కాల్చేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా మార్గదర్శకాలను రూపొందించినట్లు తెలిపారు. కోర్టు ఆదేశాలను ఖచ్చితంగా పాటించాలని జిల్లా మేజిస్ట్రేట్లు, ఎస్పీలు, స్థానిక సంస్థల ముఖ్యాధికారులకు సూచించామన్నారు.
హరిత బాణసంచాకు ప్రాధాన్యత
బాణసంచా తయారీలో సోడియం, బేరియం, రాగి, ఆల్యూమినియం వంటి లోహాలను ఉపయోగిస్తారు. ఇవి పర్యావరణంపై ప్రతికూల ప్రభావాలను చూపే అవకాశముంది. అందువల్ల పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించే లక్ష్యంతో హరిత బాణసంచా వాడకానికి ప్రాధాన్యత కల్పించామన్నారు. ప్రజలు పర్యావరణ అనుకూల బాణసంచాను మాత్రమే వాడాలి. నిషేధిత బాణసంచాను ఎక్కడైనా అమ్ముతున్నా లేదా నిల్వ ఉంచినా స్వాధీనం చేసుకోవాలన్నారు. అలాంటి బాణసంచాను నిల్వ ఉంచే గిడ్డంగులపై కూడా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించినట్లు ఆయన తెలిపారు.


