యశవంతపుర: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కల్గించిన దక్షిణ కన్నడ జిల్లా బెళ్తంగడికి చెందిన బాలికపై అత్యాచారం, హత్య కేసు పునర్విచారణను ప్రత్యేక తనిఖీ బృందం(సిట్) నిర్వహిస్తోంది. గతంలో సిట్ ముఖ్యస్తుడిగా ఉన్న సీనియర్ ఆఫీసర్ ఎన్.శశికుమార్‌ను ప్రభుత్వం బదిలీ చేసింది. ఆయన స్థానంలో సీఐడీ ఐజీపీ చేతన్ సింగ్ రాథోడ్‌ను నూతన సిట్ చీఫ్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విచారణ బృందం సభ్యులుగా వెంకటేశ్ ప్రసన్న స్థానంలో హాసన ఏఎస్పీ శ్రీనిధిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. సెప్టెంబర్ 24న ఇచ్చిన ఆదేశాల్లో మార్పు చేస్తూ శుక్రవారం కొత్త అదేశాలను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సూచించింది. సిట్ చీఫ్‌గా చేతన్‌సింగ్ రాథోడ్ నేతృత్వంలో ఐదు మంది సభ్యులు విచారణ బృందంలో పని చేయనున్నారు. బెంగళూరు గ్రామీణ జిల్లా ఏఎస్పీగా పని చేస్తున్న వెంకటేశ్ ప్రసన్న కూడా బృందంలో సభ్యులుగా ఉండేవారు. అయనపై కూడా అనేక అరోపణలు రావటంతో ఆయన స్థానంలో హాసన ఏఎస్పీని నియమించారు. ఐజీపీ శశికుమార్‌పై అనేక ఆరోపణలు రావటంతో ఇటీవల సీఎం డీకే శివకుమార్‌ను కూడా కలిసి సమస్యను వివరించటంతో తాజాగా చేతన్‌సింగ్ రాథోడ్‌ను సిట్ కొత్త చీఫ్‌గా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.
71 మందికి రాజ్యోత్సవ పురస్కారాలు
● పేర్లు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
దొడ్డబళ్లాపురం: నవంబర్ 1న కర్ణాటక రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం రాజ్యోత్సవ పురస్కారాలు ప్రకటించింది. ప్రతీ ఏడాదిలానే ఈసారి కూడా సమాజ సేవ, సంగీతం, క్రీడలు, వ్యవసాయం, పత్రికారంగం, చిత్రలేఖనం, యక్షగానం, విద్య ఇలా అనేక రంగాల్లో సేవలందించిన వారికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోని గణ్యులను గుర్తించి రాజ్యోత్సవ పురస్కారాలు అందిస్తున్నట్లు కన్నడ సంస్కృతి శాఖ వెల్లడించింది.
బెంగళూరు శివారులో చిరుత సంచారం
దొడ్డబళ్లాపురం: బెంగళూరు శివారులోని నాడప్రభు కెంపేగౌడ నగర్‌లో మరోసారి చిరుత కదలికలు కలలకలం రేపాయి. కెంగేరి–మాగడి మధ్య ఉన్న ఈ మార్గంలో ఇటీవల చిరుతలు ఎక్కువగా సంచరిస్తున్నాయి. గురువారం రాత్రి ఒక చిరుత రోడ్లమీద దర్జాగా నడుచుకుంటూ వెళ్తున్న దృశ్యాలు స్థానికంగా ఏర్పాటు చేసిన సీసీకెమెరాల్లో రికార్డు అయ్యాయి. గతంలో ఇదే ప్రాంతంలో చిరుత సంచరించింది. తాజాగా మళ్లీ చిరుత ప్రత్యక్షం కావడంతో ఈ మార్గంలో నిత్యం తిరిగే వాహనదారులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పరప్పన అగ్రహారలో
ఆకస్మిక సోదాలు
● ఎలాంటి నిషేధిత వస్తువులు దొరకలేదు
● జైళ్ల శాఖ ఏడీజీపీ అలోక్‌కుమార్ వెల్లడి
బనశంకరి: పరప్పన అగ్రహార జైలులో గురువారం అర్థరాత్రి సుదీర్ఘ తనిఖీలు చేయగా ఎలాంటి నిషేధిత వస్తువులు లభించలేదని జైళ్ల శాఖ ఏడీజీపీ అలోక్‌కుమార్ తెలిపారు. శుక్రవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. పరప్పన అగ్రహార జైలులో ఎలక్ట్రానిక్ సిటీ డీసీపీ నేతృత్వంలో 150 మందికి పైగా సిబ్బందితో సోదాలు నిర్వహించామన్నారు. జైలు లోపల గోడల పైనుంచి నిషేధిత వస్తువులు పడేయడంతో పాటు వివిధ మార్గాల ద్వారా అక్రమాలకు పాల్పడే ప్రయత్నాలు చాలా యేళ్లుగా జరుగుతున్నాయన్నారు. ఇలాంటి అక్రమాల నియంత్రణకు జైలు పాలక మండలి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుందన్నారు. చట్టవ్యతిరేక కార్యకలాపాల నియంత్రణకు తమ కార్యాచరణ కొనసాగించామని తెలిపారు. జైలు సూపరింటెండెంట్ అంశుకుమార్ బృందాన్ని కొనియాడారు. ఆగస్టు 11వ తేదీన సీసీబీ పోలీసు బృందం పరప్పన అగ్రహార జైలులో అకస్మాత్తుగా దాడి చేసింది. ఈ సమయంలో మాజీ ఎంపీ ప్రజ్వల్‌రేవణ్ణ హైసెక్యూరిటీ బ్యారక్‌లో మొబైల్ ఫోన్ ఆచూకీ లభించింది. పోలీసులు పరిశీలించగా మొబైల్‌లో ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్, నెట్‌ఫ్లిక్స్ తదితర యాప్‌లు కనిపించాయి. మొబైల్‌ను ప్రజ్వల్‌రేవణ్ణ తమ కుటుంబ సభ్యులు, న్యాయవాదులతో మాట్లాడటానికి ఫోన్ వినియోగిస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనపై పరప్పన అగ్రహార పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.


