బనశంకరి: ఉత్తరాఖండ్‌లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఐదుగురు కర్ణాటకవాసులు మృతి చెందారు. మృతుల్లో బెళగావి జిల్లా అధణి తాలూకా అరటాల గ్రామానికి చెందిన అరుణ్ సోలంకి(44), న్యాయవాది సుధీర్, శంకర్‌గౌడ, హుళియారుకు చెందిన వ్యాపారవేత్త హెచ్‌ఎస్.నటరాజ్, కాంట్రాక్టర్ ప్రతాప్‌గౌడ ఉన్నారు. కాగా సోలంకి బెంగళూరు సీసీబీ విభాగంలో సీఐగా విధులు నిర్వహిస్తున్నారు. హెలికాప్టర్ దుర్ఘటన విషయం తెలియగానే అరటాల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. 2007వ బ్యాచ్ అధికారి అరుణ్ సోలంకి ఢిల్లీలో ఇంటెలిజెన్స్ ఇన్‌స్పెక్టర్‌గా పని చేశారు. అనంతరం కర్ణాటకకు వచ్చి బెంగళూరు నగరంలోని నెలమంగల, బాణసవాడి, తుమకూరు జిల్లా కుణిగల్ పోలీస్‌స్టేషన్లలో సమర్థవంతంగా విధులు నిర్వహించారు. ప్రస్తుతం బెంగళూరులో సీసీబీ విభాగంలో పని చేస్తున్నారు. మృతుడు అరుణ్ సోలంకి భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి రామమూర్తినగరలో నివాసం ఉంటున్నారు. ఆయన తండ్రి, సోదరుడు స్వగ్రామం అరటాలలో నివసిస్తున్నారు. ఎస్‌ఐగా అరుణ్ సోలంకి విధులు నిర్వహిస్తున్న సమయంలో బాణసవాడి పోలీస్‌స్టేషన్‌కు అత్యుత్తమ పోలీస్ స్టేషన్‌గా అవార్డు లభించింది.
బంధువులు, స్నేహితుల దిగ్భ్రాంతి
హెలికాప్టర్ ప్రమాదంలో సోలంకి అరుణ్ మరణవార్త తెలియగానే కుటుంబసభ్యులు, స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. స్నేహితుడు శ్రీశైల జంబగి మాట్లాడుతూ అరుణ్ సోలంకి మృతి విషయం తెలియగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. తాను, అరుణ్ ఒకే గ్రామానికి చెందినవారం. అతను ఉన్నత స్థానంలో ఉన్నప్పటికీ తనతో చాలా స్నేహంగా ఉండేవారని, ఈ ఘటన చాలా బాధాకరమని విచారం వ్యక్తంచేశారు.
ప్రమాదంలో మృతులు వరుసగా శంకర్‌గౌడ, సుధీర్, నటరాజ్, ప్రతాప్, సీసీబీ సీఐ అరుణ్ సోలంకి(ఫైల్)
ఉత్తరాఖండ్‌లో హెలికాప్టర్ ప్రమాదం
పైలెట్‌తో సహా ఆరుగురు మృత్యువాత
మృతుల్లో కర్ణాటక వాసులు ఐదుగురు
మృతుడు –సీసీబీ ఇన్‌స్పెక్టర్ స్వస్థలం బెళగావి జిల్లాలో విషాదం


