సాక్షి, బెంగళూరు: సిలికాన్ సిటీకి పాముల బెడద పట్టుకుంది. వర్షాలు లేకపోవడంతో పాటు ఎండ తీవ్రత పెరగడంతో పాములు చల్లదనం కోసం ఇళ్ల ఆవరణలోకి, ఇళ్లలోకి వస్తుండడంతో ప్రజలకు భయం కలుగుతోంది. షూ స్టాండ్లు, బైక్‌ల వద్ద, బాత్‌రూం, వాషింగ్ మెషిన్ తదితర చోట్ల పాములు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితి కేవలం బెంగళూరులోనే కాదు కర్ణాటక మొత్తం నెలకొన్నట్లు తెలుస్తోంది. గత వారం రోజుల్లో రాష్ట్రంలో ఏకంగా 702 పాము కాటు ఘటనలు నమోదయ్యాయి. వీటిలో ఆరుగురు మరణించారు. జనవరి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 17,608 పాము కాటు ఘటనలు జరగ్గా, ఈ ఏడాది 205 మంది మృత్యువాత పడ్డారు.
వర్షాలతో చల్లని వాతావరణం
గత వారం వర్షాల కారణంగా బెంగళూరులో వాతావరణం చల్లబడింది. అయితే గత మూడు రోజుల నుంచి ఎండల తీవ్రత మరోసారి గణనీయంగా పెరిగింది. దీంతో ఎండ వేడిమికి, అధిక ఉష్ణోగ్రతలకు తట్టుకోలేక పాములు ఇళ్ల వద్దకు, లోపలికి పరుగులు తీస్తున్నాయి. ఇంటి పరిసరాల్లోకి చేరి ప్రశాంతంగా నివాసం ఉంటున్నాయి. ఇళ్ల వద్దకు పాములు అధికంగా వస్తుండడంతో రెస్క్యూ కోసం వినతులు కూడా అధికంగా వస్తున్నాయి. గతంలో కంటే ఈసారి బీబీఎంపీ, పోలీసు సహాయవాణిలకు, అగ్నిమాపక దళానికి ప్రజల నుంచి వినతులు పెరిగాయి. గత మూడు రోజుల్లోనే ఏకంగా 200కు పైగా పాముల నుంచి రెస్క్యూ కోసం కాల్స్ వచ్చాయి.
అభివృద్ధి పనులతో ఆవాసానికి భంగం
బెంగళూరు విద్యారణ్యపుర, నాగరబావి, ఆర్‌ఆర్ నగర, యలహంక, జేపీ నగర, సర్జాపుర తదితర నగరంలోని పలు ప్రాంతాల్లో నిర్మాణాలు, అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనుల కారణంగా పాముల నైసర్గిక ఆవాస స్థానాలకు ప్రమాదం ఏర్పడుతోంది. దీంతో సహజంగానే జనావాసాల్లోకి పాములు పరుగులు పెడుతున్నాయి. పాము కాటు కేసులు పెరుగుతుండడంతో ఆరోగ్య శాఖ అప్రమత్తం అయింది. అన్ని జిల్లాస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పాము కాటుకు యాంటీ వెనమ్ ఔషధ నిల్వలను పెంచింది. ఇదే సమయంలో ఇళ్ల వద్ద పాములు కనిపిస్తే వాటిని స్వయంగా పట్టుకునేందుకు ప్రయత్నించవద్దని అధికారులు కోరుతున్నారు. సహాయవాణికి కాల్ చేయడం లేదా స్నేక్ పట్టుకునే నిపుణులను పిలవడం మంచిదని సూచిస్తున్నారు. పాము కాటుకు గురైన వ్యక్తులు ఆలస్యంగా చేయకుండా వెంటనే వైద్య సహాయం పొందాలని సూచించారు.
తరచూ ఇళ్ల వద్దకు పాములు
పెరిగిన ఉష్ణోగ్రతల నుంచి
ఉపశమనానికి..
అభివృద్ధి పనుల కారణంగా
జనావాసాల ను ఆశ్రయిస్తున్న వైనం


