సాక్షి బళ్లారి: ద్విచక్ర వాహనాన్ని టిప్పర్ ఢీకొట్టడంతో ఓ యువకుడు ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటన గురువారం రాత్రి నగరంలోని రేడియో పార్కు వద్ద చోటుచేసుకుంది. నగరంలోని కౌలు బజార్‌కు చెందిన అబు (18) అనే యువకుడు ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా వేగంగా దూసుకొచ్చిన టిప్పర్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలు కావడంతో ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి ఆందోళన చేపట్టారు. ఈ ప్రాంతంలో మైన్స్ టిప్పర్లు పెద్ద సంఖ్యలో సంచరిస్తూ ప్రమాదాలకు కారణంగా మారుతున్నాయని తెలిపారు. ఏపీఎంసీ మాజీ అధ్యక్షుడు నాగరాజు, స్థానిక కార్పొరేటర్ గోవిందరాజు ఘటన స్థలానికి చేరుకుని ఆందోళనకారులకు మద్దతుగా నిలిచారు. ఈ ప్రాంతంలో మైన్స్ టిప్పర్లు తిరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. మృతుడు కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
యువకుడు దుర్మరణం


