సాక్షి, బళ్లారి: జిల్లా పంచాయతీ, సాంఘిక సంక్షేమ శాఖ, పాఠశాల విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో బళ్లారి జిల్లా పంచాయతీ కార్యాలయంలోని నజీర్ సభాంగణంలో శుక్రవారం అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా స్థాయి యువజన మాక్ పార్లమెంట్ నిర్వహించారు. స్పీకర్, మంత్రులు, ప్రతిపక్ష నాయకుల పాత్రల్లో విద్యార్థులు ఆకట్టుకున్నారు. ప్రశ్నోత్తరాల సమయం, జీరో అవర్, నూతన బిల్లులు ప్రవేశపెట్టి ప్రత్యక్షంగా వివరించారు. వివిధ బిల్లులపై అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య వాడీవేడిగా చర్చ జరిగింది. అదనపు జిల్లా అధికారి మహమ్మద్ ఎన్.జుబేర్ మాట్లాడుతూ.. యువత రాజ్యాంగ విలువలు తెలుసుకుని, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. మాక్ పార్లమెంట్‌తో విద్యార్థులు నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవచ్చన్నారు. 18 ఏళ్లు నిండిన వారు ఓటు హక్కు కోసం నమోదు చేసుకోవాలన్నారు. జిల్లా న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు రామబ్రహ్మం మాట్లాడుతూ.. పోటీ ప్రపంచంలో విద్యార్థులు తమకంటూ ప్రత్యేక వ్యక్తిత్వాన్ని రూపొంచుకోవాలంటే విషయ పరిజ్ఞానం, నైపుణ్యం, మంచి లక్షణాలు అలవర్చుకోవాలన్నారు. ఓటు కేవలం ఒక హక్కు మాత్రమే కాదని.. భవిష్యత్తులో ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నికై రాష్ట్రాన్ని, దేశాన్ని ముందుకు నడిపించాల్సిన బాధ్యత యువతపై ఉందని గుర్తు చేశారు. మాక్ పార్లమెంట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు.
అధికార, విపక్షాల మధ్య చర్చ
ప్రజా సమస్యలు వివరిస్తున్న
సభ్యుడు


