శివాజీనగర: మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యపై వచ్చిన స్టింగ్ ఆపరేషన్ వీడియో కల్పితమని సీసీబీ సైబర్ పోలీసులు పేర్కొంటూ క్లీన్‌చిట్ ఇచ్చారు. రాష్ట్రంలో కొన్నిరోజులుగా స్టింగ్ ఆపరేషన్ రభస సృష్టించడం తెలిసిందే. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వ్యక్తులను అప్రతిష్టపాలు చేయడానికి ఈ వీడియో ప్రచారం చేసి ఉండవచ్చని కూడా పోలీసులు పేర్కొన్నారు. స్టింగ్ ఆరోపణలన్నీ కల్పితమని, దర్యాప్తులో సిద్దరామయ్యకు క్లీన్‌చిట్ లభించిందని సీసీబీ గురువారం ఓ మీడియా ప్రకటనలో తెలిపింది. ఇలా వివాదానికి ముగింపు పలకాలని డీకే సర్కారు నిర్ణయానికి వచ్చింది.
సీసీబీ ప్రకటనలో ఏముంది?
దర్యాప్తులో నమోదు చేసిన వాంగ్మూలాలు, సేకరించిన సాక్ష్యాలు, వీడియోలో చిత్రీకరించినట్లుగా అలాంటి సంఘటన జరిగిందని నిర్ధారించడం లేదని సీసీబీ పోలీసులు ప్రకటనలో తెలిపారు. 2011లో జరిగినట్లు చెప్పబడుతున్నీ వీడియోను, ఒక కథనాన్ని సృష్టించి, దురుద్దేశాలను నెరవేర్చుకునేలా ఉందన్నారు. వీడియోలో కనిపించిన వ్యక్తులందరిరనీ గుర్తించి, వారిని క్షుణ్ణంగా విచారించినట్లు చెప్పారు. వీడియో చిత్రీకరించిన మొబైల్‌ఫోన్‌ను ఫోరెన్సిక్ పరీక్షకు పంపగా, నివేదిక రావాల్సి ఉందన్నారు. ఈ వీడియో కల్పితమని చెబుతూనే ముందుగా ప్లాన్ చేసి చిత్రీకరించారా, కృత్రిమంగా సృష్టించారా అనేది దర్యాప్తులో నిర్ధారించాలని చెప్పడం గమనార్హం.
స్టింగ్ ఎపిసోడ్‌లో సిద్దరామయ్యకు ఊరట
సిద్దరామయ్యకు క్లీన్‌చిట్ ఇస్తున్నాం
క్షుణ్ణంగా దర్యాప్తు చేశాం
బెంగళూరు సీసీబీ పోలీసుల ప్రకటన
మంత్రులతో సిద్దు మంతనాలు
శివాజీనగర: సిద్దరామయ్య తన కావేరి నివాసంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో అల్పాహార విందు జరపడం చర్చనీయాంశమైంది. స్టింగ్ దర్యాప్తు ఆలస్యంపై ఇందులో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. సీఎం పదవిని వీడాక మౌనంగా ఉన్న సిద్దరామయ్య మళ్లీ చురుకుగా మారి, నివాసంలో మంత్రులు, ఎమ్మెల్యేలతో భేటీ జరపడం విశేషం. నవంబర్ 26న మైసూరులో తాము జరిపే రాజ్యాంగ దినోత్సవ వేడుకల సభపై చర్చించారు. ఇది కుమారుడు మంత్రి యతీంద్ర నిర్వహించిన అల్పాహార భేటీ అయినా సిద్దరామయ్యే అన్నీ తానయ్యారు. మంత్రులు మునియప్ప నరేంద్రస్వామి, చెలువరాయస్వామి, యూ.టీ.ఖాదర్, పుట్టరంగశెట్టి తదితరులు పాల్గొన్నారు. స్టింగ్ కేసులో ఎటువంటి అరెస్టు జరగలేదని, ఆరోపణలున్న కృపా ఆళ్వా విదేశాలకు వెళ్లిపోయారని మంత్రి యతీంద్ర సైతం ఆగ్రహించినట్లు తెలిసింది. కాగా రాజ్యాంగ సభకు సీఎం డీకే శివకుమార్‌ను ఆహ్వానించాలని నిర్ణయించారు.


