● పురుగుమందు
తాగి భర్త బలవన్మరణం
హొసపేటె: భార్య పుట్టింటి నుంచి తిరిగి రాకపోవడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పురుగు మందు తాగి మృతి చెందిన విషాద ఘటన గురువారం విజయనగర జిల్లా కూడ్లిగిలో చోటు చేసుకుంది. వివరాలు.. కూడ్లిగి పట్టణ పంచాయతీ పరిధిలోని అమరదేవరగుడ్డలో బేల్దారి పనులు చేస్తున్న వీ.అశోక్ (30) మద్యానికి బానిసయ్యాడు. ఈ అలవాటు కారణంగా భార్యతో అశోక్‌కు తరచు గొడవ జరిగేది. ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా తన సోదరుడికి రాఖీ కట్టేందుకు పుట్టింటికి వెళ్లిన భార్య ఇంటికి తిరిగి రాలేదు. అశోక్ పలు మార్లు పిలిచినా ఆమె కాపురానికి రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఈ క్రమంలో పంటలకు పిచికారీ చేసే పురుగు మందు తాగాడు. అతడిని తొలుత ప్రాథమిక చికిత్స కోసం కూడ్లిగి ప్రభుత్వ ఆస్పత్రికి, అనంతరం మెరుగైన చికిత్స కోసం కొప్పళ ఆస్పత్రికి తరలించగా మృతి చెందాడు. మృతుడి సోదరుడు మంజునాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కూడ్లిగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అగ్నిప్రమాదంలో మొక్కజొన్న పంట దగ్ధం
హొసపేటె: సండూరు తాలూకా చోరనూరు ఫిర్కా పరిధిలోని బండ్రి గ్రామంలో ఓ రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది. రైతు బి.మారెప్ప పొలంలో ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో మొక్కజొన్న పంట పూర్తిగా కాలిపోయింది. పంట కళ్లముందే అగ్నికి ఆహుతి కావడంతో రైతు తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. సమాచారం అందుకున్న రెవెన్యూ శాఖ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి పంట నష్టాన్ని పరిశీలించారు. బాధిత రైతుకు తగిన నష్టపరిహారం అందించేలా ప్రభుత్వానికి నివేదిస్తామని అధికారులు తెలిపారు.
ఫ్లైయాష్ బెడద అరికట్టండి
రాయచూరు రూరల్: తాలూకాలోని చిక్కసూగూరు వద్ద ఉన్న టెక్సాన్ స్టీల్ పరిశ్రమ నుంచి వస్తున్న ఫ్లైయాష్ నియంత్రణకు చర్యలు చేపట్టాలని కర్ణాటక యువ జాగృతి వేదిక డిమాండ్ చేసింది. గురువారం జిల్లాధికారి కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకుడు మహ్మద్ వసీం మాట్లాడారు. స్టీల్ పరిశ్రమ నుంచి బయటికొస్తున్న ఫ్లైయాష్ గ్రామాల్లోని ఇళ్లలో భోజన సమయంలో అన్నం, సాంబారుల్లో పడడం వల్ల పలు వ్యాధులు సోకే అవకాశాలున్నాయని, వాటి నియంత్రణకు ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు చేపట్టాలని కోరుతూ అదనపు జిల్లాధికారి శివానందకు వినతిపత్రం సమర్పించారు.
టవర్ తొలగింపు
పనులు షురూ
బళ్లారిఅర్బన్: నగరంలోని రైల్వే స్టేషన్ ఎదురుగా జిల్లాధికారి కార్యాలయం వెనుక భాగంలోని సమాచార ప్రచార శాఖ కార్యాలయం సమీపంలో ఉన్న ఎయిర్‌లైన్స్ హైటవర్‌ను తొలగించే పనులు ప్రారంభమయ్యాయి. కార్మికులు టవర్‌ను తొలగిస్తున్న దృశ్యాలు గురువారం కనిపించాయి. సుదీర్ఘకాలంగా నిరుపయోగంగా ఉన్నందున ఈ టవర్‌ను తొలగిస్తున్నట్లు సమాచారం.
ఉజ్వల భవితకు కళాశాల విద్య నాంది
రాయచూరు రూరల్: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు కళాశాల విద్య నాంది పలకాలని నవయుగ కళాశాల సూపరింటెండెంట్ విఘ్నేశ్వరన్ పేర్కొన్నారు. జిల్లాలోని మాన్వి పట్టణంలోని కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యా శాఖలో విధులు నిర్వహించే ఉపాధ్యాయులు పిల్లల సంక్షేమ కోసం పాటు పడాలన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభకు తార్కాణంగా విద్యార్థుల భవిష్యత్తును రూపొందించాలని పిలుపు ఇచ్చారు.


