బళ్లారిఅర్బన్: ఎంజీ సమీపంలోని చక్రవర్తి వైన్ షాప్ ఎదురుగా ప్రధాన రహదారి పక్కన బుధవారం రాత్రి ఓ ఆవు మృతి చెందింది. ప్లాస్టిక్ వ్యర్థాలను తినడం వల్లే ఆవు కడుపు ఉబ్బి మరణించి ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఆవు మృతిని గమనించిన సాయిరాం క్యాటరింగ్ యజమాని రాధాకృష్ణ శెట్టి సంబంధిత కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులకు సమాచారం అందించారు. అయినా గురువారం ఉదయం 10 గంటల వరకు కళేబరాన్ని తొలగించకపోవడంతో స్థానికులు అసహనం వ్యక్తం చేశారు. కళేబరం అక్కడే ఉండటంతో తీవ్ర దుర్వాసన వ్యాపించి చుట్టుపక్కల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు ఉదయం 11 గంటల సమయంలో జేసీబీ సాయంతో ఆవు కళేబరాన్ని వాహనంలోకి ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. కాగా రోడ్ల పక్కన మూగజీవాలు మరణించినప్పుడు సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని స్థానికులు కోరారు.
దుర్వాసనతో యాతన పడిన జనం
అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం


