బాలికల కిశోరి కేంద్రం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

బాలికల కిశోరి కేంద్రం ప్రారంభం

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

రాయచూరు రూరల్‌: జిల్లాలో 2026–27వ విద్యా సంవత్సరానికి సంబంధించి బాలికలకు కిశోరి కేంద్రాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ సమన్వయ అధికారి గోకార్‌ సాబ్‌ ప్రారంభించారు. ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో బాలికలకు బాల్య వివాహాల నిర్మూలన, రక్త హీనత, ఆప్తసమాలోచనలు, మహిళల సమస్యల పరిష్కారానికి అవకాశాలను కల్పించారన్నారు.

కన్నడ సాహిత్యంతో ప్రజా చైతన్యం

హొసపేటె: సమాజంలో మార్పు తేవడంతో పాటు ప్రజల్లో చైతన్యం కలిగించే శక్తి కన్నడ సాహిత్యానికి ఉందని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం మాజీ సిండికేట్‌ సభ్యుడు పద్మ విఠల్‌ అన్నారు. పట్టణంలోని జీవీపీపీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం నిర్వహించిన కవి సమ్మేళనం ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. యువత పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలన్నారు. సాహిత్యం ద్వారా సమాజ సేవ చేయాలని పలువురు వక్తలు సూచించారు. అనంతరం విజయనగర జిల్లాలోని వివిధ తాలూకాలకు చెందిన 25 మందికి పైగా విద్యార్థులు కవి సమ్మేళనంలో పాల్గొని తమ కవితలను వినిపించారు.

స్థానిక ఎన్నికలపై

ఆశావహుల గురి

బళ్లారిఅర్బన్‌: త్వరలో జరిగే జెడ్పీ, టీపీ ఎన్నికలకు రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లు ఖరారు చేసిన నేపథ్యంలో ఆయా జెడ్పీ, టీపీ స్థానాల బరిలో నిలిచేందుకు ఆయా పార్టీల తరఫున ఆశావహ అభ్యర్థులు ముందుకు వస్తున్నారు. బళ్లారి తాలూకా సింధవాళ జెడ్పీ స్థానం ఎస్టీకి రిజర్వ్‌ కావడంతో అక్కడి నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున జెడ్పీ అభ్యర్థిగా పోటీకి వీరాపురం గ్రామానికి చెందిన బి.శ్రీనివాసులు, పరమదేవనహళ్లి (పీడీహళ్లి) టీపీ స్థానం నుంచి వీ.ఉమా ఆసక్తి చూపుతున్నారు.

డీడీపీఐకి జేడీగా పదోన్నతి

రాయచూరు రూరల్‌: జిల్లాలో 2026–27వ విద్యా సంవత్సరానికి సంబంధించి ఐదు నెలల క్రితం జిల్లా విద్యాశాఖాధికారి(డీడీపీఐ)గా మల్లికార్జున అధికార బాధ్యతలు చేపట్టారు. బుధవారం కలబుర్గి డివిజన్‌ విద్యా శాఖ జాయింట్‌ డైరెక్టర్‌(జేడీ)గా ఆయనకు పదోన్నతి లభించింది. 25 ఏళ్ల పాటు విద్యా రంగంలో అందించిన సేవానుభవంతో ఆయనకు జేడీగా పదోన్నతి కల్పిస్తూ సర్కార్‌ ఆదేశాలు జారీ చేసింది.

నిందితుడిని

కఠినంగా శిక్షించాలి

హుబ్లీ: ధార్వాడ జిల్లా అళ్నావర తాలూకా హొన్నపుర తాలూకాలో బాలికపై జరిగిన లైంగిక దాడి, దౌర్జన్యం కేసులో నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ హిందూ సంఘాలు అళ్నావరలో గురువారం తహసీల్దార్‌కు వినతిపత్రాన్ని సమర్పించారు. సదరు నిందితుడు మక్తుంసాబ్‌ నదాఫ్‌పై ఇప్పటికే కేసు నమోదైందని, అతనిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబానికి భద్రత కల్పించాలి. తగిన పరిహారం కూడా అందించాలని అళ్నావర తాలూకా ప్రజలు ఒత్తిడి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement