ఎమ్మెల్సీల గెలుపు.. సర్కారుకు కుదుపు | - | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్సీల గెలుపు.. సర్కారుకు కుదుపు

Oct 30 2026 1:33 AM | Updated on Oct 30 2026 1:33 AM

సాక్షి,బళ్లారి: రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ సర్కార్‌కు విద్యావంతులు తగిన బుద్ధి చెప్పారని ఎమ్మెల్సీ రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి పేర్కొన్నారు. గురువారం నగరంలోని మోకా రోడ్డులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడారు. ఈ ప్రాంతంలో జరిగిన ఈశాన్య ఉపాధ్యాయ నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలో నాలుగు స్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్‌డీఏకి చెందిన నలుగురు అభ్యర్థులు గెలుపొందడం కాంగ్రెస్‌ పార్టీకి చెంపపెట్టులాంటిదన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ వర్గానికి కూడా మేలు చేయలేదన్నారు. కుర్చీలు మార్చుకోవడం తప్ప ఏమాత్రం అభివృద్ధి జరగడం లేదన్నారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు, బాలింతల మరణాలు పెరిగిపోతున్నాయన్నారు.

వర్సిటీల్లో అధ్యాపకుల కొరత

విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకుల కొరత ఉందన్నారు. అతిథి అధ్యాపకులపైనే ఆధారపడాల్సి వస్తోందన్నారు. ముఖ్యంగా కళ్యాణ కర్ణాటకలో విద్యారంగ సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారని విమర్శించారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిందని ఆర్థిక శాఖ వెల్లడించిందన్నారు. కొత్త పనులను ప్రకటించకూడదన్నారు. ఇకపై అప్పులు చేసే పరిస్థితి కూడా లేదని హెచ్చరికలు ఉన్నప్పటికీ మంగళూరులో రూ.32 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రకటించడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈవీఎంలపై నిరంతరం అభ్యంతరం వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రస్తుతం ఏం సమాధానం చెబుతారన్నారు. బ్యాలెట్‌ పేపర్లతో జరిగిన విధాన పరిషత్‌ ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటిందన్నారు. ఈవీఎంల్లో ఎలాంటి అక్రమాలు జరగడం లేదనేందుకు ఇదే నిదర్శనం అన్నారు.

మంచి చేసి ఓట్లు అడగాలి

ప్రజలకు మంచి చేసి ఓట్లు అడగాలన్నారు. అలా కాకుండా ఓడిపోయిన తర్వాత నిందించడం సరికాదన్నారు. బ్యాలెట్‌ పేపర్ల ద్వారా జరిగిన ఎన్నికలపై కూడా అనుమానం వ్యక్తం చేస్తే మరి ఇక ఏ పద్ధతిలో ఓటింగ్‌ నిర్వహించాలో కూడా వారే తెలియజేయాలన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ(సర్‌)ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌కు రాబోయే రోజుల్లో జనమే బుద్ధి చెబుతారన్నారు. పాలధర పెంపుపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామన్నారు. సామాన్యుడికి గుదిబండగా మారనున్న పాల ధర పెంపుపై పునరాలోచన చేయాలన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చెరకు, పాడి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారన్నారు. పార్టీ నాయకులు కే.ఎస్‌.దివాకర్‌, గురులింగనగౌడ, డాక్టర్‌ బీ.కే.సుందర్‌, హనుమంతప్ప తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ వైఫల్యాల వల్లే

బీజేపీ అభ్యర్థుల ఘనవిజయం

విద్యావంతులైన ఓటర్లు

ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు

ఎమ్మెల్సీ రవికుమార్‌, మాజీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement