హొసపేటె: ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు హక్కును కాపాడాలని, సర్ ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని, ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం హగరిబొమ్మనహళ్లి పట్టణంలోని బసవేశ్వర సర్కిల్ వద్ద సీపీఐ నాయకులు, కార్యకర్తలు మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. సీపీఐ జిల్లా కార్యదర్శి హెచ్‌ఎం.సంతోష్ మాట్లాడుతూ లక్షలాది మంది ప్రజల త్యాగాలు, పోరాటాల ఫలితంగా సాధించుకున్న ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది అని అన్నారు. కులం, మతం, లింగం, ఆర్థికస్థితి, విద్యతో సంబంధం లేకుండా ప్రతి పౌరుడికి రాజ్యాంగం సమాన ఓటు హక్కును కల్పించిందన్నారు. అయితే ప్రస్తుతం ప్రజాస్వామ్య విలువలు ముప్పును ఎదుర్కొంటున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్య సంస్థల స్వయం ప్రతిపత్తిని, జవాబుదారీతనాన్ని బలహీనపరుస్తోందని విమర్శించారు. స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా పని చేయాల్సిన ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ చేతిలో కీలుబొమ్మగా మారిందని, దీంతో ఎన్నికల సంఘం స్వతంత్రత, విశ్వసనీయతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. ప్రజల ఓటు హక్కును పరిరక్షించేందుకు సర్‌ను రద్దు చేయడంతో పాటు ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్‌కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో సీపీఐ తాలూకా కార్యదర్శి గంగాధర్, సంయుక్త కార్యదర్శి దాదావలి, కార్యదర్శి మండలి సభ్యుడు అన్వర్ బాషా, తాలూకా నాయకులు అంజినప్ప, ముదియప్ప, మైలప్ప, హరిగొండనహళ్లి కొట్రేష్, లక్ష్మిదొడ్డ మల్లేశన్న, గోనెప్ప, దాదరప్ప, నాగరాజ్, లలిత, కెంచమ్మ, దురుగమ్మ, విజయమ్మ, వెంకటమ్మ, రత్నమ్మ తదితరులు పాల్గొన్నారు.
సీఈసీ జ్ఞానేష్ కుమార్
రాజీనామా చేయాలి
బసవేశ్వర సర్కిల్‌లో సీపీఐ మానవహారం
కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలతో ఆందోళన


