హుబ్లీ: సాధనకు వయస్సు అడ్డు కాదని హుబ్లీకి చెందిన రెండేళ్ల చిన్నారి సుభిక్ష నిరూపించారు. ఈమె ట్రెడ్‌మిల్‌లో 600 మీటర్లను కేవలం 9.27 సెకన్లలో అధిగమించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో తన పేరును లిఖించుకుంది. 2024 డిసెంబర్ 3న పుట్టిన సుభిక్ష సాధనను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంపాదక మండలి 2026 ఆగస్టు 31న ధ్రువీకరించి చిన్నారికి ఐబీఆర్ అఛీవర్ గౌరవాన్ని కట్టబెట్టింది. చిన్నారి విశిష్ట సాధనపై కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హుబ్లీ ఇంద్రప్రస్థనగర నివాసులైన స్కేటింగ్ అండ్ సైక్లింగ్ కోచ్ వినాయక్, సుష్మ దంపతుల కుమార్తె సుభిక్ష తండ్రి మార్గదర్శనంలో సుమారు 3 నెలల పాటు ఇంటిలోనే ట్రెడ్‌మిల్ శిక్షణ పొందింది. తండ్రితో పాటు తల్లి, అవ్వ శివలింగవ్వ, ఇతర కుటుంబ సభ్యులు కూడా ప్రోత్సహించారు. ఈతలో శిక్షణ ఇప్పించాలని అనుకున్నా స్విమ్మింగ్ పూల్‌లో ఫ్లోరైడ్ మిశ్రిత నీటి వల్ల చిన్నారి మృదువైన చర్మానికి అనారోగ్య సమస్యలు తలెత్తవచ్చన్న వైద్యుల సలహాతో స్మిమింగ్ శిక్షణకు తాత్కాలికంగా బ్రేక్ వేశారు. చిన్నారి సోదరుడు సుస్మిన్ సైక్లింగ్, స్కేటింగ్ శిక్షణ సందర్భంలో సుభిక్ష ట్రెడ్‌మిల్‌లో శిక్షణకు ఆసక్తి చూపుతోందని గమనించి తల్లిదండ్రులకు సూచించాడు. చైన్నెకి చెందిన దియా అనే రెండేళ్ల బాలిక 600 మీటర్ల దూరాన్ని 10 నిమిషాల్లో అధిగమించిన దాఖలా ఉండగా సుభిక్ష ఆ దూరాన్ని 9.27 సెకన్లలోనే అధిగమించి అందరి ప్రశంసలు అందుకుంది. ఈమె ఘనతపై తల్లిదండ్రులు, బంధుమిత్రులు, స్థానికులు ప్రశంసలు కురిపించారు. ఇంత చిన్న వయస్సులోనే ఘనత సాధించిన చిన్నారి భవిష్యత్తులో క్రీడా రంగంలో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు.
ట్రెడ్‌మిల్‌లో అద్భుత ఘనత
ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు


