బళ్లారి రూరల్: వైద్యశాస్త్రంలో ప్రతి 5 లక్షల మందిలో ఒకరికి వచ్చే పిండంలో పిండానికి అరుదైన శస్త్రచికిత్సను గురువారం బళ్లారి వైద్య కళాశాల ఆస్పత్రి పరిశోధన కేంద్రం(బీఎంసీఆర్‌సీ) పీడియాట్రిక్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. వివరాల్లోకెళితే.. రాయచూరు జిల్లా సింధనూరుకు చెందిన ఓ గర్భిణి మహిళ వైద్య పరీక్షల కోసం ఆస్పత్రి రేడియాలజీ విభాగానికి వచ్చారు. ఆమెను పరీక్షించిన రేడియాలజీ విభాగాధిపతి డాక్టర్ సదాశివగౌడ నేతృత్వంలోని వైద్యుల బృందం మహిళ గర్భంలోని పిండంలో మరో పిండం ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత ఆమె రెండు నెలల క్రితం ఆసుపత్రిలో మగబిడ్డకు జన్మనిచ్చింది. బుధవారం ఆ శిశువుకు కడుపు ఉబ్బరించిందని ఆసుపత్రిలో చేరారు. పీడియాట్రిక్ సర్జరీ విభాగం వైద్యులు రెండు నెలల శిశువుకు పరీక్షలు నిర్వహించారు. కడుపులో ఉన్న పిండాన్ని శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ఈ శస్త్రచికిత్స నిర్వహించిన వైద్యబృందంలో పీడియాట్రిక్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ గడ్డి దివాకర్, డాక్టర్ సంజీవ్ జోషి, డాక్టర్ రాంమోహన్, డాక్టర్ అశ్విత, అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్ బాలసుబ్రమణ్యం, డాక్టర్ పరిమళ, డాక్టర్ నిజాముద్దీన్, డాక్టర్ రఘునాథ్, డాక్టర్ మధుశ్రీ, నర్సింగ్ సిబ్బంది ఉన్నారు. చిన్నారికి శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించిన వైద్యులను ఆస్పత్రి డీన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ మరిరాజ్ జీర్, ప్రిన్స్‌పాల్ డాక్టర్ మల్లికార్జున అభినందించారు.
గర్భస్త దశలోనే పిండంలో పిండం గుర్తింపు
బీఎంసీఆర్‌సీ ఆస్పత్రి వైద్యుల బృందం ఘనత


