ఆర్థికాభివృద్ధికి ఊతం | - | Sakshi
Sakshi News home page

ఆర్థికాభివృద్ధికి ఊతం

Oct 29 2026 1:42 AM | Updated on Oct 29 2026 1:42 AM

గొర్రెల పెంపకం..

సాక్షి,బళ్లారి: ఏటేటా ప్రతి గ్రామంలోను కరువు పరిస్థితులు తీవ్రం అవుతున్న నేపథ్యంలో గ్రామస్తులు కరువును అధిగమించడానికి వినూత్న తరహాలో ఆలోచించారు. సాధారణంగా దేవుడి సొమ్ము అంటే అందరికీ భయమే. అయితే ఆ దేవుడి సొమ్మును సక్రమమైన మార్గంలో ఉపయోగించి, తిరిగి వడ్డీతో సహా చెల్లించి వ్యాపారం చేసుకుంటే ఆ దేవుడు కృప కూడా ఉంటుందని విశ్వసించిన ఆ గ్రామస్తులు కరువును అధిగమించారు. కొప్పళ జిల్లా హనుమనహళ్లి గ్రామంలో వెలసిన మారుతేశ్వరుని ఆలయ సొమ్మును గ్రామంలో ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాల్లో మహిళలకు అందించి వాటితో స్వయంశక్తితో వ్యాపారం చేసుకుని స్వావలంబన పొందాలని సూచించారు. దేవుడి సొమ్మును గ్రామంలో కొన్ని కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు అందజేశారు. ఆ డబ్బును తీసుకున్న మహిళలు గొర్రె పిల్లలను కొనుగోలు చేసి వాటిని ఆరు నెలల పాటు పెంచి పోషించి మూడు రెట్ల లాభానికి అమ్మి సొమ్ము చేసుకుని దేవుడి సొమ్ము తిరిగి చెల్లించడం ఆనవాయితీగా మారింది.

దినదినాభివృద్ధిగా వ్యాపారం

క్రమంగా గ్రామంలోని పేద, పీడిత కుటుంబాలకు దేవుడి సొమ్మును ఇవ్వడం పరిపాటిగా మారింది. ఆ సొమ్ము తీసుకుని వ్యాపారం చేసుకున్న వారందరూ ఆర్థికంగా బాగుపడేందుకు ఆ మారుతేశ్వరుడి కృప కలిగిందని భావించిన హనుమనహళ్లి గ్రామస్తులు దేవుడి సొమ్ము తీసుకుని గొర్రెలు పెంపకం ప్రారంభించారు. గొర్రెల పెంపకంతో ఆ గ్రామంలో ప్రతి ఇల్లు ఆర్థికంగా బాగుపడేందుకు దోహదం చేసింది. ఈ సందర్భంగా కొందరు మహిళలు మాట్లాడుతూ పదేళ్ల క్రితం గ్రామంలో మారుతేశ్వరుడి సొమ్ముతో గొర్రెల పెంపకం ప్రారంభించామని, ఈ వ్యాపారం దినదినాభివృద్ధి చెందుతూ గొర్రెలను మరిన్ని పెంచడానికి వీలైందని, దేవుడి సొమ్మును తిరిగి చెల్లిస్తూ, తమ గొర్రెల వ్యాపారాన్ని విస్తరించామన్నారు. అంతా ఆ మారుతేశ్వరుడి కృపా కటాక్షం వల్ల తమ కుటుంబాలు బాగు పడేందుకు వీలైందని హర్షం వ్యక్తం చేశారు. మారుతున్న కాలానుగుణంగా ఆధునిక జీవనశైలి ప్రభావంతో అనేక గ్రామాల్లో వివిధ రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ గ్రామంలో ప్రత్యేకత కనిపిస్తోంది.

ఏడాదిలోపు తిరిగి చెల్లించాలి

హనుమనహళ్లిలో సంస్కృతి, వారసత్వాలను కాపాడటంతో పాటు ఆర్థిక స్వావలంబన పొందేందుకు కృషి చేస్తున్నారు. ఏటా గ్రామంలో జరిగే జాతరలో మిగిలిన సొమ్మును ప్రజలకు ఇవ్వడం, తద్వారా ఆర్థికంగా ముందడుగు సాధించడం ఆనవాయితీగా వస్తోంది. అలా ఇచ్చిన సొమ్మును వచ్చే ఏడాది జాతరలోపు తిరిగి ఇవ్వాలనే షరతు ఉంటుంది. దేవుడి సొమ్ము అంటే భయంతో వాడుకుని, దానిని రెట్టింపు చేసుకుని తిరిగి ఇవ్వడంతో అటు ఆలయాభివృద్ధి, ఇటు ఆర్థికంగా బాగు పడేందుకు వీలైందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మారుతేశ్వరుడి ఆలయ సొమ్ము కూడా దాదాపు రూ.40 లక్షలకు చేరడం విశేషం. ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎదురు చూడకుండా, దేవుడి సొమ్మును గ్రామంలో పేదరిక నిర్మూలనకు ఉపయోగిస్తున్నారు. దేశంలో రూ.కోట్లాది నిధులు ఉన్న ఎన్నో ఆలయాల్లో ఇలాంటి పద్ధతినే అనుసరిస్తే ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా బాగుపడేందుకు వీలవుతుందనేందుకు హనుమనహళ్లిలో వినూత్న తరహాలో చేపడుతున్న ఈ కార్యక్రమమే ఉదాహరణగా నిలుస్తుందని చెప్పవచ్చు.

దేవుడి సొమ్ముతో మహిళల జీవితాల్లో వెలుగులు

కరువును జయిస్తున్న హనుమనహళ్లి గ్రామస్తులు

అంతా ఆ మారుతేశ్వరుడి కృపేనని

అంటున్న వైనం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement