● రూ.లక్షల్లో ఒకరికి వంచన
హుబ్లీ: వినాయక నగర్‌కు చెందిన శాంతవీర గౌడను ఆన్‌లైన్ వంచకులు రూ.లక్షలాది మేర వంచించారు. ఆయన మొబైల్‌కు వస్తున్న కాల్స్, ఎస్‌ఎంఎస్‌లను గుర్తు తెలియని మొబైల్ నెంబర్‌కు ఫార్వర్డ్ చేసి ఆయన పేరిట క్రెడిట్ కార్డు తీసుకున్నారు. ఈ క్రమంలో దశల వారీగా రూ.1,91,543లను బదలాయించుకొని వంచించినట్లు బాధితుడు నగర సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నగదు, వెండి ఆభరణాల చోరీ
మరో ఘటనలో ఓ ఇంట్లో నగదు, వెండి ఆభరణాలు చోరీ అయ్యాయి. నగరంలోని సహస్రార్జున నగర్‌లోని జంజిసాబ్ గార్గ్ అనే వ్యక్తి ఇంటి వెనుక తలుపునకు వేసిన తాళాన్ని పగలగొట్టి లోనికి వెళ్లిన దొంగలు అల్మారాలో పెట్టిన నగదుతో పాటు రూ.55 వేల విలువ చేసే ఆభరణాలను చోరీ చేశారు. రూ.5,200 విలువ చేసే 65 గ్రాముల తూకం ఉన్న వెండి ఆభరణాలను చోరీ చేసి పరారయ్యారని పాత హుబ్లీ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
లారీ ఢీకొని బాలిక మృతి
హొసపేటె: విజయనగర జిల్లా మరియమ్మనహళ్లి బస్టాండ్ సమీపంలో రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న బాలిక(9)ను లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మరణించిన ఘటన మంగళవారం జరిగింది. తల్లిదండ్రులతో కలిసి పట్టణానికి వచ్చిన బాలిక మరణించడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మరో వైపు మద్యం తాగి నిర్లక్ష్యంగా లారీ నడిపిన డ్రైవర్ బాలికను ఢీకొన్న అనంతరం కూడా ఆగకుండా వెళ్లినట్లు సమాచారం. ఘటన వివరాలు తెలుసుకునేందుకు వచ్చిన ఓ బైకర్‌ను కూడా లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బైకర్ గాయాలతో బయటపడ్డాడు. బాలిక ప్రాణాలు బలిగొన్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఘటనపై మరియమ్మనహళ్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కాలువలకు నిరంతరం
నీరు వదలాలి
రాయచూరు రూరల్: కళ్యాణ కర్ణాటకలోని రాయచూరు, లింగసూగూరు, దేవదుర్గ, యాదగిరి, సురపుర తాలూకాల్లో నారాయణ పుర కుడి కాలువ కింద ఉన్న ఉపకాలువలకు నిరంతరం నీటిని విడుదల చేయాలని మాజీ మంత్రి రాజు గౌడ డిమాండ్ చేశారు. మంగళవారం బెంగళూరులో కృష్ణా భాగ్య జల నిగమ కమిషనర్‌తో ఆయన మాట్లాడారు. ఎన్‌ఆర్‌బీసీ ఉప కాలువలకు వార బందీ పద్ధతికి స్వస్తి పలికి నిరంతరం నీటిని విడుదల చేయాలన్నారు. కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందడం లేదన్నారు.
31న భగవద్గీత అభియాన్
హొసపేటె: హొసపేటెలో 19వ శ్రీ భగవద్గీత అభియాన్‌కు శ్రీకారం చుట్టనున్నారు. సోండా స్వర్ణవల్లి మహాసంస్థాన్ ఆధ్వర్యంలో జరుగుతుందని బుధవారం అభియాన్ కమిటీ అధ్యక్షుడు డి.గౌతమ్ తెలిపారు. హృదయ బలహీనతను విడిచి పెట్టి దైర్యంగా ముందుకు సాగాలనే స్పూర్తిని ప్రజల్లో నింపడం ఈ ఏడాది అభియాన్ ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. 31 సాయంత్రం 4 గంటలకు హోటల్ మల్లిగి ఆడిటోరియంలో జరుగుతుందని తెలిపారు.
సాంఘిక దురాచారంపై చర్యలకు వినతి
రాయచూరు రూరల్: రాయచూరు జిల్లా లింగసూగూరు తాలూకా నాగరాళలో హోటల్‌లో ఎస్సీ కులానికి చెందిన శివానంద అనే వ్యక్తికి జగ్గు ద్వారా దోసిలిలోకి నీరు పోసి తాగించిన వారిపై చర్యలు తీసుకోవాలని దళిత సంఘర్ష సమితి డిమాండ్ చేసింది. బుధవారం లింగసూగూరు డీఎస్పీ కార్యాలయం వద్ద చేపట్టిన ఆందోళనలో సంచాలకులు అమరేష్ మాట్లాడారు. హోటల్‌లో శివానందకు నీటిని ఎత్తిపోయడాన్ని ఖండించారు. హోటల్ యజమానిపై కేసు నమోదు చేయాలని డీఎస్పీ సులేమాన్‌కు వినతిపత్రం సమర్పించారు.
చెరువులను సంరక్షించండి
రాయచూరు రూరల్: గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల సంరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని ఎమ్మెల్సీ, మాజీ మంత్రి బోసురాజు సూచించారు. మంగళవారం జానేకల్, సిరవార, ఆల్దాళ, అమరావతి, నక్కుంది, బాగలవాడ గ్రామాల్లో తాగునీటి చెరువుల సంరక్షణకు సంబంధించి అధికారులతో మాట్లాడారు. తాగునీటి ఎద్దడి నెలకొనకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి పైపులైన్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గ్రామాల్లోని చెరువులకు మహర్దశ కల్పించడానికి ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్లు తెలిపారు.


