విద్యుత్‌ సరఫరా మెరుగు పరచండి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సరఫరా మెరుగు పరచండి

Oct 29 2026 1:42 AM | Updated on Oct 29 2026 1:42 AM

రాయచూరు రూరల్‌: గ్రామీణ ప్రాంతాలకు సక్రమంగా విద్యుత్‌ సరఫరా చేపట్టాలని రాయచూరు గ్రామీణ ఎమ్మెల్యే బసనగౌడ దద్దల్‌ అధికారులకు సూచించారు. మంగళవారం బెంగళూరులో కేపీసీఎల్‌ ఎండీ రాజేంద్ర చోళన్‌ సమక్షంలో ఆయన మాట్లాడారు. తాలూకాలోని వివిధ ప్రాంతాల్లో రైతులు జెస్కాం కార్యాలయాలను ముట్టడిస్తున్నందున రైతులకు 12 గంటల పాటు విద్యుత్‌ సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. వైటీపీఎస్‌, ఆర్టీపీఎస్‌ల పని తీరుపై కూడా వారితో సమీక్షించారు.

పిల్లలకు న్యాయ పరిజ్ఞానం అవసరం

హొసపేటె: పిల్లల భద్రత, హక్కుల పరిరక్షణతో పాటు చట్టాలపై ప్రతి విద్యార్థికి అవగాహన ఉండాలని విజయనగర జిల్లా న్యాయ సేవల అథారిటీ సభ్య కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.సుబ్రహ్మణ్య అన్నారు. బాలల రక్షణ కోసం రూపొందించిన చట్టాలు, ప్రభుత్వ పథకాలపై విద్యార్థులకు అవగాహన కల్పించడం అవసరమని అన్నారు. సురక్షిత బాల్యం ప్రచారంలో భాగంగా సోమవారం హొసపేటెలో వివిధ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు చదువుపై దృష్టి సారించి, మంచి విద్యను అభ్యసిస్తూ తమ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకోవాలని సూచించారు. విద్యే ఉజ్వల భవిష్యత్తుకు పునాది అన్నారు.

కరువు పరిహారం కోసం ధర్నా

రాయచూరు రూరల్‌: ఉత్తర కర్ణాటక, కళ్యాణ కర్ణాటక జిల్లాల్లో తీవ్ర కరువు సంభవించినందున రైతులకు కరువు పరిహారం అందించాలని శివసేన కర్ణాటక జిల్లాధ్యక్షుడు రాజాచంద్ర రామనగౌడ డిమాండ్‌ చేశారు. బుధవారం అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద చేపట్టిన ధర్నాలో ఆయన మాట్లాడారు. రైతులు, ప్రజలు కరువుతో కొట్టుమిట్టాడుతుంటే ప్రజాప్రతినిధులు మౌనం దాల్చడం తగదన్నారు. తుంగభద్ర ఎడమ కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరందించాలన్నారు. గేజ్‌ నిర్వహణలో నెలకొన్న లోపాలను సవరించాలన్నారు. నారాయణ పుర కుడి కాలువ ఆయకట్టు చివరి భూములకు నీరు విడుదల చేయాలని, కరువు పరిహారం కింద ఎకరాకు రూ.50 వేలు చొప్పున ఇవ్వాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు.

క్షయవ్యాధిని నిర్మూలిద్దాం

హొసపేటె: క్షయవ్యాధితో బాధపడుతూ ఆస్పత్రికి రాని రోగులను ఇంటింటికి వెళ్లి గుర్తించి, వారికి తగిన చికిత్స అందించడం ద్వారా క్షయవ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ చేతులు కలపాలని జిల్లా ఆరోగ్య విద్యా అధికారి దొడ్డమని అన్నారు. నగరంలోని 35వ వార్డులో బుధవారం నిర్వహించిన క్షయవ్యాధి అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించి ఆయన మాట్లాడారు. క్షయ రోగులు దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు విడుదలయ్యే క్రిములు గాలి ద్వారా ఇతరుల శరీరంలోకి ప్రవేశించి సంక్రమణకు కారణమవుతాయి. అందువల్ల వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. క్షయవ్యాధి సూపర్‌వైజర్‌ ఖాసిం సాబ్‌, హెచ్‌ఐఓ యశోద, పీహెచ్‌సీఓ ఉదమా, గుల్నాజ్‌, ఆశా కార్యకర్తలు, వార్డు నాయకులు హాజరయ్యారు.

లారీ నుంచి పడి కార్మికుడి మృతి

పావగడ: పట్టణ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పాలవల్లి గ్రామ సమీపంలో సొప్పులమ్మ ఆలయం వద్ద వెళ్తున్న గ్రానైట్‌ లారీ రోడ్డుపై వేసిన హంప్స్‌ కుదుపులకు అదిరి లారీ వెనుక భాగంలో కూర్చున్న కార్మికుడు ప్రదీప్‌ దాస్‌ కిందకు పడి తలకు తీవ్ర గాయమైంది. ఆ వెంటనే బాధితుడిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరిశీలించి తలకు తీవ్ర గాయం కావడంతో మృతి చెందాడని తెలిపారు. చంద్రబావి నుంచి గ్రానైట్‌ లారీలో బూపూరు తండాకు వెళ్తుండగా మార్గ మధ్యంలోని పాలవల్లి వద్ద లారీ డ్రైవర్‌ సయ్యద్‌ జబీర్‌ అజాగ్రత్తగా లారీని నడపడంతో తన కుమారుడు కిందకు పడి మృతి చెందాడని మృతుడి తండ్రి రంజిత్‌దాస్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement