రాయచూరు రూరల్: రాష్ట్రంలో జరిగిన నాలుగు విధాన పరిషత్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైందని, 2028లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు పరిషత్ ఎన్నికల ఫలితాలు దిక్సూచి అని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి, విధాన పరిషత్ ప్రభుత్వ చీఫ్ విప్ రవికుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగులుతుందన్నారు. రాష్ట్రంలో జరిగిన నాలుగు విధాన పరిషత్ స్థానాల ఎన్నికల్లో బీజేపీ, జేడీఎస్ మైత్రి కూటమి ఘనవిజయం సాధించిందన్నారు. కల్యాణ కర్ణాటక భాగంలోని ఈశాన్య ఉపాధ్యాయ క్షేత్రం కలబుర్గి డివిజన్‌లో తండ్రి, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కుమారుడు, హోం మంత్రి ప్రియాంఖ ఖర్గేలకు తగిన గుణపాఠం నేర్పారన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ఎద్దేవా చేయడం సిగ్గుచేటన్నారు. మంత్రులకు అహంభావం అధికమైందన్నారు. శంకరప్ప, సిద్దన గౌడ, పాటిల్, సంతోష్, రాజగురు, రవీంద్ర జాలదార్, రాజ్ కుమార్, జంబణ్ణ, శివకుమార్, బండేష్‌లున్నారు.


