బనశంకరి: అధికార కాంగ్రెస్ పార్టీ ఊహించనంతగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయి. రెండు ఉపాధ్యాయ, రెండు పట్టభద్రుల స్థానాలకు హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో అధికార పార్టీ చతికిలపడడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొత్తం నాలుగింటిలోనూ ప్రతిపక్ష బీజేపీ– జేడీఎస్ కూటమి విజయఢంకా మోగించింది. కాంగ్రెస్ నాయకుల్లో అంతర్మథనం, ఎన్‌డీఏ కూటమి నేతల్లో నూతనోత్సాహం నెలకొంది.
ఎక్కడ.. ఎవరు గెలిచారు
● బెంగళూరు ఉపాధ్యాయుల క్షేత్రంలో జేడీఎస్ అభ్యర్థి ఏపీ.రంగనాథ్‌కు 10,810 ఓట్లు, బీజేపీ అభ్యర్థి పుట్టణ్ణకు 9,902 ఓట్లు వచ్చాయి.
● ఈశాన్య ఉపాధ్యాయ క్షేత్రంలో బీజేపీ అభ్యర్థి శశీల్ నమోశి 15,596 ఓట్లు సాధించగా, కాంగ్రెస్ నేత శరణప్ప మట్టూరుకు 12,299 ఓట్లు పడ్డాయి. బీజేపీకి 3,297 ఓట్ల మెజారిటీ దక్కింది.
● పశ్చిమ పట్టభద్రుల స్థానంలో బీజేపీ అభ్యర్థి ఎస్‌వీ.సంకనూరు వరుసగా మూడోసారి గెలుపొందారు. సంకనూరుకు 33,711 ఓట్లు , బీజేపీ అభ్యర్థి మోహన్ లింబికాయకు 24,388 ఓట్లు లభించాయి.
● ఆగ్నేయ పట్టభద్రుల స్థానంలో బీజేపీ అభ్యర్థి కేఎం.సురేశ్‌కు 66,020 ఓట్లు, బీజేపీ అభ్యర్థి శశి హులికుంటెకు 42,922 ఓట్లు వచ్చాయి. 20,076 ఓట్లు చెల్లలేదు. బీజేపీ అభ్యర్థి గెలిచారు.
● కాంగ్రెస్ అభ్యర్థులు అందరూ మట్టికరిచారు.
కార్యకర్తల సంబరాలు
మంగళవారం సాయంత్రం మొదలైన ఫలితాల సరళిలో ప్రతిపక్ష కూటమి గెలుపు సుస్పష్టమైంది. బెంగళూరు, కలబుర్గి, ధార్వాడ కేంద్రాలలో రాత్రి పొద్దుపోయేవరకూ ఓట్ల లెక్కింపు కొనసాగింది. మెజారిటీ తథ్యమని తేలగానే రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు కేరింతలు కొడుతూ చిందులేశారు. 2028లో రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఫలితాలు దిక్సూచిగా ఇరుపార్టీల సీనియర్ నాయకులు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఓట్ చోరీ పేరుతో రాద్దాంతం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి గుణపాఠమని అన్నారు. ఈ ఫలితాల వల్ల ఇప్పటివరకు జరిగిన రాజకీయ పరిణామాలు ఒకెత్తయితే, ఇకముందు జరగబోయే పరిణామాలు ఒకెత్తుగా మారాయి. ఆయా పార్టీలకు రాజీనామాలు, చేరికలు ఊపందుకునే అవకాశముంది.
సర్కారుకు చెంపపెట్టు: కుమార
దొడ్డబళ్లాపురం: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థుల గెలుపు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు అని కేంద్రమంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై బుధవారంనాడు మీడియాతో మాట్లాడిన ఆయన రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కి పట్టం కడతారనడానికి ఇది సంకేతమన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు, అవినీతి, పాలనా వైఫల్యానికి ప్రజలు కొట్టిన దెబ్బ అన్నారు. బీజేపీ, జేడీఎస్ ఐక్యత, కార్యకర్తల శ్రమ వల్లే ఈ గెలుపు సాధ్యమైందన్నారు. బిడది టౌన్‌షిప్, నైస్ అక్రమాలు, హామీల ఎగవేత, కేపీఎస్‌సీ కుంభకోణం, స్టింగ్ ఆపరేషన్‌లు కాంగ్రెస్ పార్టీ పరువుని రోడ్డున పడేశారని విమర్శించారు. అందుకే ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు.
కాంగ్రెస్‌కు తిరస్కారమే: యడియూరప్ప
బనశంకరి: ఓట్ల చోరీ గురించి కాంగ్రెస్ అబద్ధాలను మేధావి ఓటర్లు తిరస్కరించారు అనడానికి ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు చక్కని ఉదాహరణ అని బీజేపీ మాజీ సీఎం బీఎస్.యడియూరప్ప అన్నారు. బుధవారం బెంగళూరులో పార్టీ కేంద్ర కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. యడ్డి మాట్లాడుతూ హస్తం ప్రభుత్వం ఖజానా లూటీ, పగటి దోపిడీకి పాల్పడి ప్రజలకు ద్రోహం చేసిందన్నారు. అధికారంలో కొనసాగే నైతిక హక్కు లేదని, తక్షణం రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరాలని సవాల్ చేశారు. ఈ ఎన్నికలు ఈవీఎంల ద్వారా జరగలేదని, ప్రజల మనసుల్లో కాంగ్రెస్‌పై ఉన్న కోపానికి ఫలితాలు నిదర్శనమని అన్నారు. తమ అభ్యర్థి కేఎం.సురేశ్ 23 వేల ఓట్ల భారీ ఆధిక్యంతో గెలిచారన్నారు. అందరికీ ఎక్కువ మెజారిటీలు వచ్చాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 కోట్ల మంది ప్రజలను కన్నీటిపాలు చేసిందన్నారు. ఎలాంటి అభివృద్ధి లేకపోగా శాంతి భద్రతలు క్షీణించాయని, అవినీతి, కుంభకోణ ప్రభుత్వమని దుయ్యబట్టారు. 3,500 మందికి రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, కరువు నిర్వహణలో సర్కారు విఫలమని ఆరోపించారు. 8 నెలలుగా దివ్యాంగులు, వృద్ధులకు పెన్షన్లు అందడం లేదన్నారు. ప్రజలు చెల్లించిన పన్నుల డబ్బు ఎక్కడికి వెళ్లిందని ప్రశ్నించారు.
తగిన శాస్తి జరిగింది: విజయేంద్ర
మైసూరు: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థులు ఘనవిజయం సాధించడం అధికార కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక గంట అని, ఏ క్షణంలో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరిగినా 130కి పైగా స్థానాల్లో గెలిచి అధికారం చేపడతామని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై విజయేంద్ర చెప్పారు. మైసూరులోని హోటల్ ప్రెసిడెంట్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎన్నికల్లో ఓటర్లు తమనే ఆశీర్వదించారన్నారు. గ్యారంటీల భ్రమల్లో, అధికార మాయలో మునిగి తేలుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన శాస్తి జరిగిందన్నారు.
హస్తంలో అంతర్మథనం
4 ఎమ్మెల్సీ స్థానాల్లో అనూహ్య ఓటమి
రాష్ట్ర రాజకీయాల్లో భారీ కుదుపు


