తుమకూరు: కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను డిస్మిస్ చేసి, సర్ ప్రక్రియను రద్దు చేసి బ్యాలెట్ బాక్సుల పద్ధతిలో ఎన్నికలు జరపాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయం ఎదుట మానవహారం నిర్వహించారు. జిల్లా కార్యదర్శి గిరీష్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం 2023లో కేంద్ర ఎన్నికల సంఘానికి సవరణ చేయడం ద్వారా జ్ఞానేష్ కుమార్‌ను కాపాడుతోందని ఆరోపించారు. జ్ఞానేష్ కుమార్ బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ ఏజెంట్‌గా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఎన్నికల్లో బీజేపీ గెలిచేలా చూస్తున్నారని దుయ్యబట్టారు.
క్షమాపణ కోరను
● మంత్రి యతీంద్ర
మైసూరు: అంబావిలాస్ ప్యాలెస్, దసరా జంబూ సవారీ అంబారీ గురించి తాను చేసిన వ్యాఖ్యలపై కట్టుబడి ఉన్నా, క్షమాపణ కోరేది లేదని నగరాభివృద్ధి మంత్రి యతీంద్ర సిద్ధరామయ్య తెలిపారు. యతీంద్ర మైసూరు రాజవంశీకులను కించపరిచేలా మాట్లాడారని వివాదం చెలరేగడం తెలిసిందే. బుధవారం మైసూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ మైసూరు ప్యాలెస్ ప్రభుత్వం ఆస్తి, అదే విషయాన్ని చెప్పానన్నారు. అయితే కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు. రాజమాత ప్రమోదాదేవిని అగౌరవపరిచేలా మాట్లాడలేదని, ఆమె అంటే తనకు అపారమైన గౌరవం ఉందని, రాష్ట్ర అభివృద్ధి కి వారు చేసిన సేవలు అపారమని కొనియాడారు. రాజకుటుంబం బంగారు అంబారీని ఇవ్వకపోతే జంబూ సవారీ నిర్వహించలేమని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యమని, ఇక్కడున్నది ప్రజల ప్రభుత్వమని, ప్రజల కోసం దసరా నిర్వహిస్తున్నామని అన్నారు.
మసాలా దోసెలో బొద్దింక
● ఓ ప్రముఖ హోటల్‌లో ఘటన
యశవంతపుర: బెంగళూరు నగరంలో బెస్ట్ హోటల్‌గా పేరుగాంచిన మల్లేశ్వరంలోని ఓ హోటల్‌లో మసాలా దోసెలో బొద్దింక వచ్చిందని ఓ కస్టమర్ ఆరోపించాడు. వివరాలు.. వెన్న దోసెకు పేరుగాంచిన ఈ హోటల్‌కు రోజూ వేల సంఖ్యలో వస్తుంటారు. కస్టమర్ కూడా దోసె ఆర్డర్ ఇచ్చాడు. దోసె తింటుండగా చచ్చిన బొద్దింక అందులో ఉంది. సిబ్బందికి చెప్పగా, వారు పెద్దగా స్పందించలేదు. మరో దోసెను ఇస్తామని తాపీగా చెప్పారని కస్టమర్ తన వీడియోలో తెలిపాడు. బొద్దింక పడిన దోసెకు బదులు మరో దోసెను ఇస్తే సరిపోతుందా అని అతడు తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. పేరున్న హోటళ్లలోనే పరిస్థితి ఇలా ఉంటే అధికారులు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నించాడు.
నగర చెత్త ఖర్చు పెంపా?
● ఆధునిక వాహనాల వల్లనే: మంత్రి
బనశంకరి: బెంగళూరు నగరవ్యాప్తంగా చెత్త తరలింపు ఖర్చును ఒక్కసారిగా పెంచడంపై విమర్శలు వస్తున్నాయి. దీని వెనుక కుంభకోణం ఉందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై స్పందిస్తూ పారదర్శకతతో నిర్వహించే ఉద్దేశంతో 27 నియోజకవర్గాల్లో 33 ప్యాకేజీలుగా విభజించి నూతన టెండర్ల ప్రక్రియ చేపడుతున్నామని బెంగళూరు నగరాభివృద్ధి శాఖ మంత్రి కృష్ణబైరేగౌడ తెలిపారు. బుధవారం జీబీఏ కార్యాలయంలో విలేకరులతో మంత్రి మాట్లాడుతూ నూతన టెండరు నిబంధనల ప్రకారం ప్రతి ప్యాకేజీ కార్యనిర్వహణకు కాంట్రాక్టర్లు సుమారు రూ.10 కోట్లు పెట్టుబడి పెట్టాలి. పూర్తి వ్యవస్థను సంఘటితం చేసి పనులు ప్రారంభించడానికి కాంట్రాక్టర్లు 2 నెలల సమయం కోరగా దీనికి సమ్మతించామని తెలిపారు. నగరంలో చెత్త నిర్వహణకు ఏడాదికి రూ.597 కోట్లు వ్యయం అవుతుందన్నారు. అత్యాధునిక పరిజ్ఞానం కలిగిన కొత్త వాహనాలతో చెత్త తరలింపునకు ఆ వ్యయం రూ.620 కోట్ల కు చేరుకుందన్నారు. ఈ సమావేశంలో జీబీఏ కమిషసర్ మహేశ్వర్‌రావ్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


