రాయచూరు రూరల్: ఈ నెల 20వ తేదీన బెంగళూరు పులకేశి నగరలో జరిగిన బాంబు పేలుడు కేసులో అస్సాంకు చెందిన అహ్మద్ బర్భుయ్య బుర్హన్ అనే నిందితున్ని విచారించడానికి జిల్లాలోని మస్కికి ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) వచ్చింది. మంగళవారం రాత్రి మస్కిలో నివాసంలో అతన్ని 4 గంటల పాటు విచారణ జరిపారు. నివాసంలో ఉన్న పరికరాలు, వస్తువులను తనిఖీ చేశారు. తరువాత అతడిని అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించారు. బెంగళూరులో పేలిన బాంబును ఇతడే తయారు చేశారని పోలీసులు తెలిపారు. ఈ వ్యవహారంతో స్థానికంగా భయాందోళన నెలకొంది.
సార్.. వెన్నునొప్పిగా ఉంది
● జడ్జికి దర్శన్ ఫిర్యాదు
యశవంతపుర: చిత్రదుర్గ రేణుకాస్వామి హత్య కేసులో బెంగళూరు పరప్పన సెంట్రల్ జైల్లో ఉన్న ప్రముఖ నటుడు, నిందితుడు దర్శన్‌కు మళ్లీ వెన్నునొప్పి వచ్చినట్లు చెప్పాడు. బుధవారం అప్రూవర్ ప్రదోష్‌ను పోలీసులు విచారించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దర్శన్, పవిత్రాగౌడలతో పాటు ఇతర నిందితులను హాజరు పరిచారు. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న పునీత్.. రేణుకాస్వామిని హత్య చేసిన షెడ్ వద్ద నటుడు దర్శన్, పవిత్రాగౌడను తాను చూడలేదని చెప్పాడు. ప్రభుత్వ న్యాయవాది అభ్యంతరం చెబుతూ పునీత్‌ను ప్రతికూల సాక్షిగా పరిగణించాలని జడ్జికి మనవి చేశారు. ఇంతలో దర్శన్ తనకు వెన్నునొప్పిగా ఉందని, జైల్లో చలి ఎక్కువగా ఉన్నందున నొప్పి తిరగబెట్టిందని తెలిపాడు. ఫిజియోథెరపీ చేయాలని ఆదేశించాలని జడ్జికి విన్నవించారు. అందుకు పిటిషన్ దాఖలు చేయాలని జడ్జి సూచించారు.


