బళ్లారి రూరల్ : కన్నకొడుక్కు పెళ్లి నిశ్చయమైంది. మరో 18 రోజుల్లో పెళ్లి జరగాల్సి ఉంది. బంధుమిత్రులను ఆహ్వానించడానికి చీరలు, పెళ్లిపత్రికలతో దంపతులు ఇద్దరూ బాడుగ కారులో వెళ్తున్నారు. ఇంతలో కాలయముడు మరో కారు రూపంలో ఎదురు వచ్చి ఢీకొట్టాడు. కొడుకు పెళ్లి చూడకుండానే ఆ తల్లి కన్నుమూసింది. తండ్రి తీవ్రంగా గాయప డ్డాడు. మనసు కలిచివేసే ఈ ఘటన సోమవారం కంప్లి–కుడితిని మార్గంలోని దరోజీ సమీపంలోని దేవలాపురం వద్ద జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కుడితిని పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా కణేకల్లుకు చెందిన వీరేశ్, సావిత్రమ్మ దంపతుల కుమారుడి వివాహం నవంబర్ 15న జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో బళ్లారి జిల్లాలోని బంధువులను ఆహ్వానించడానికి పెళ్లి పత్రికలు, చీరలను బాడుగ కారులో పెట్టుకొని బయల్దేరారు.
ఉదయం నుంచి పలు చోట్ల పత్రికలు పంచి..
సోమవారం ఉదయం పలు చోట్ల పెళ్లి పత్రికలు పంచి, సాయంత్రం కుడితిని సమీపంలోని దేవలాపురం వద్ద కారులో వెళ్తుండగా ఎదురుగా వచ్చిన బొలెరో కారు ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న సావిత్రమ్మ (55) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందింది. అదే కారులో ఉన్న సావిత్రమ్మ భర్త వీరేశ్ (66), బాడుగ కారు ఓనర్ కమ్ డ్రైవర్ గుడ్డద శ్రీనివాస్ (50), బొలెరో డ్రైవర్ సురేశ్(27) గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని బీఎంసీఆర్‌సీ ట్రామాకేర్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఓనర్ కమ్ డ్రైవర్ గుడ్డద శ్రీనివాస్ మృతి చెందారు. సావిత్రమ్మ భర్త వీరేశ్, బొలెరో డ్రైవర్ సురేష్ చికిత్స పొందుతున్నారు. ఘటనపై కుడితిని పోలీసులు కేసు నమోదు చేసుకొన్నారు. కాగా పెళ్లికాబోయే వధూవరులు, బంధువులు ఆస్పత్రి మార్చురీ వద్దకు చేరుకుని భోరున విలపించారు. ఈ ఘటనతో పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి.
దరోజీ సమీపంలోని దేవలాపురం వద్ద రోడ్డు ప్రమాదం
రెండు కార్లు ఢీకొని ఇద్దరు మృతి,
మరో ఇద్దరికి గాయాలు
మృతుల్లో వరుడు తల్లి, కారు డ్రైవర్, పెళ్లింట విషాదఛాయలు


