సాక్షి,బళ్లారి: భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అవమానకరంగా మాట్లాడటం సరికాదని, తక్షణం ఆయన క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేసింది. మంగళవారం జిల్లా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మోదీపై ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నేతలు, కార్యకర్తలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయల్ సర్కిల్ నుంచి నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇటీవల బిహార్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఓ కార్యకర్త మోదీ ఎక్కడికీ వెళ్లరని ఆయన ఇక్కడే ఉంటారని చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఖర్గే చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధాకరంగా ఉన్నాయన్నారు. మోదీ కాదు, ఆయన తండ్రిని కూడా ఉద్దేశించి మాట్లాడటంలో అర్థం లేదన్నారు. దేశంలో ప్రధానమంత్రి మోదీపై పెరుగుతున్న జనాదరణ చూసి, సహించలేక ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తక్షణం మల్లికార్జున ఖర్గే క్షమాపణలు చెప్పాలన్నారు. రాజకీయంగా నిరాశకు గురైన ఖర్గే సహనం కోల్పోయి, అనుచితంగా మాట్లాడుతున్నారన్నారు. దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని తిరస్కరించినా ఆ పార్టీకి బుద్ధి రాలేదన్నారు. మోదీని ఎంత విమర్శిస్తే అంత ఎత్తుకు ఎదుగుతారన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న ప్రధానిపై మాట్లాడే ముందు, బాధ్యతాయుతంగా మాట్లాడితే మంచిదన్నారు. రాజ్యాంగంపై కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం గౌరవం ఉన్నా ఇలా అనుచితంగా మాట్లాడే వారు కాదన్నారు. బీజేపీ నాయకులు గురులింగనగౌడ, హనుమంతప్ప, కే.ఎస్.దివాకర్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
అమానుషంగా మాట్లాడటం ఖండనీయం
వెంటనే మల్లికార్జున ఖర్గే
క్షమాపణలు చెప్పాలి
మాజీ ఎమ్మెల్యే
గాలి సోమశేఖరరెడ్డి డిమాండ్


