సాక్షి,బళ్లారి: నగరంలో దసరా పండగ రోజు విషాదం నెలకొంది. దసరా సెలవు రోజున ఆయుధ పూజ ముగించుకుని సరదాగా చారిత్రక బళ్లారి కొండను చూసేందుకు వచ్చిన తండ్రీ, కుమారుడు నీటి కొలనులో పడి మృతి చెందిన ఘటన బుధవారం నగర నడిబొడ్డున జరిగింది. బళ్లారి కొండను సందర్శించే పర్యాటకుల సందడి పెరగడంతో పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా కణేకల్ గ్రామానికి చెందిన వారు బళ్లారికి వచ్చి కొండపైకి ఎక్కారు. రమేష్ (40), అతని కుమారుడు వన్నూరుస్వామి(10) ఇద్దరు కొండపైన విహరిస్తుండగా కొండ పైభాగాన ఉన్న నీటికొలనులో చేపలు కనిపించడంతో సంబర పడిన బాలుడు వన్నూరుస్వామి చేపలను పట్టుకునేందుకు ప్రయత్నించాడు. కాలు జారి కొలనులోకి పడిన కుమారుడిని రక్షించేందుకు ప్రయత్నించిన రమేష్ కూడా పడిపోవడంతో ఇద్దరూ లోతుగా ఉన్న నీటిలో మునిగి మృతి చెందారు. ఈ ఘటనపై సమీపంలోని తోటి సందర్శకులు పోలీసులకు సమాచారం అందించడంతో అగ్నిమాపక సిబ్బందితో హుటాహుటిన రంగంలోకి దిగి మృతదేహాలను వెలికితీశారు. కౌల్‌బజార్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బళ్లారి కొండపై కొలనులో
తండ్రీ, కుమారుడు మృతి
మృతులు అనంతపురం జిల్లా
కణేకల్ వాసులుగా గుర్తింపు


