హుబ్లీ: హుబ్లీ తాలూకా వరూరు వద్ద జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఎం.ఆర్.ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఓ బాలిక మృతి చెందగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా.. రాజస్తాన్ నుంచి బెంగళూరు వైపునకు వెళ్తున్న బస్సు.. వరూరు సమీపంలోని చబ్బి క్రాస్ వంతెన దాటిన తరువాత ప్రమాదవశాత్తూ అదుపుతప్పడంతో రోడ్డు పక్కన ఉన్న పొలాల్లోకి దూసుకెళ్లి పడిపోయింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 26 మంది ప్రయాణికులు ఉన్నారు. దివ్య కుమారి (8) అనే బాలిక అక్కడికక్కడే మృతి చెందింది. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని కేఎంసీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిద్ర మత్తులో బస్సును నిర్లక్ష్యంగా నడపడంతో బస్సు బోల్తా పడిందని అనుమానిస్తున్నారు. హుబ్లీ గ్రామీణ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.


