బళ్లారి: నగరంలోని గాంధీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతనం కేసుతో పాటు కంప్లి పోలీస్ స్టేషన్‌లో నమోదైన మరో దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ఒక నిందితుడిని అరెస్టు చేసి, రూ.2.98 లక్షల విలువైన వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. బళ్లారి నగరం కప్పగల్లు రోడ్డులోని ఎస్‌ఆర్ లేఅవుట్‌కు చెందిన జి.మల్లయ్య ఇంట్లో 2026 మే నెలలో 15 క్వింటాళ్ల బియ్యం, 50 కిలోల పప్పులు, 53 అంగుళాల శాంసంగ్ టీవీ చోరీకి గురయ్యాయి. వీటి విలువ రూ.1.37 లక్షలుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై గాంధీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూలై 8న కంప్లి పోలీస్ స్టేషన్‌లో మరో దొంగతనం కేసు నమోదైంది. ఈ రెండు కేసుల్లో బళ్లారి రూపనగుడి రోడ్డుకు చెందిన లారీ డ్రైవర్ ఎన్.రాజేష్ నాయిస్ మరో ముగ్గురు వ్యక్తులు నిందితులుగా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. రాజేష్‌ను అరెస్టు చేసి న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. మిగిలిన ముగ్గురు పరారీలో ఉన్నారు. నిందితుల నుంచి రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మోటార్‌సైకిల్, 12 క్వింటాళ్ల బియ్యం, 53 అంగుళాల శాంసంగ్ టీవీ, బజాజ్ ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. పోలీసులను పనితీరును జిల్లా ఎస్పీ డాక్టర్ సుమన్ డి.పెన్నేకర్ అభినందించారు.


