హొసపేటె: తుంగభద్ర జలాశయం నుంచి తెలంగాణకు నీటి విడుదలకు సంబంధించి కీలక ప్రతిపాదన వెలువడింది. 2026 అక్టోబర్ 10 నుంచి 24వ తేదీ వరకు 15 రోజుల పాటు మొత్తం 2.981 టీఎంసీల నీటిని విడుదల చేయనున్నారు. మొదటి ఐదు రోజులు రోజుకు 2,500 క్యూసెక్కులు, తదుపరి ఐదు రోజులు రోజుకు 2,300 క్యూసెక్కులు, చివరి ఐదు రోజులు రోజుకు 2,100 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయాలని ఇండెంట్‌లో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కేసీ కాలువ నీటి అవసరాలతో ఈ నీటి విడుదలను సమన్వయం చేయాలని గద్వాల్, కర్నూల్ నీటిపారుదల సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజనీర్లు అంగీకరించినట్లు ప్రతిపాదనలో వెల్లడించారు. ఇలా సమన్వయంతో నీటిని విడుదల చేయడం ద్వారా రవాణా నష్టాలను తగ్గించి, రెండు రాష్ట్రాలకు నీరు సమర్థవంతంగా అందేలా చూడవచ్చని కోరారు. కర్ణాటక కోటా ముగియడంతో హెచ్‌ఎల్‌సీకి కర్ణాటక కోటా నీటి సరఫరా నిలిపేశారు. ఆంధ్రప్రదేశ్ కోటాను యథాతధంగా కొనసాగించారు.
15 రోజుల పాటు విడతల వారీగా 2.981 టీఎంసీల నీటి సరఫరా


